'టైగర్‌ నాగేశ్వరరావు' టీజర్‌పై హైకోర్టు అభ్యంతరం.. నిర్మాతకు నోటీసులు

టైగర్‌ నాగేశ్వరరావు సినిమా టీజర్‌లో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని అవమానించేదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

By అంజి  Published on  31 Aug 2023 10:00 AM IST
AP High Court, producer,Tiger Nageswara Rao movie, Tollywood

'టైగర్‌ నాగేశ్వరరావు' టీజర్‌పై హైకోర్టు అభ్యంతరం.. నిర్మాతకు నోటీసులు

తెలుగు చిత్రసీమలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'టైగర్ నాగేశ్వరరావు' ఒకటి. ఇందులో రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం బడ్జెట్ పరంగా కూడా అతని కెరీర్‌లో అతిపెద్దది. ఈ సినిమాలో రవితేజ పేరు మోసిన దొంగగా కనిపించనున్నాడు. కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో రవితేజ నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ లుక్‌లు వేర్వేరు టైమ్ జోన్‌లలో సెట్ చేయబడతాయి. ఇప్పటివరకు ఈ లుక్‌లు సీక్రెట్‌గా ఉన్నాయి. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు వంశీకృష్ణ దర్శకత్వం వహించాడు. హిందీ హీరోయిన్ నూపూర్ సనన్ కథానాయికగా నటించింది. తాజాగా టైగర్‌ నాగేశ్వరరావు సినిమా టీజర్‌లో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్టుపురం ప్రాంత వాసులను అవమానించేదిగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ లేకుండా టీజర్‌ ఎలా రిలీజ్‌ చేస్తారని అభ్యంతరం తెలిపింది.

సమాజం పట్ల బాధ్యతగా ఉండొద్దా? అంటూ సినిమా నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టీజర్‌ ద్వారా సమాజానికి ఏమి మెసేజ్‌ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ సినిమా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మరోవైపు సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఛైర్‌పర్సన్‌ను ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. అభ్యంతరాలపై ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఎరుకల సామాజికవర్గ మనోభావాలను కించపరిచేదిగా ఉందని, స్టువర్టుపురం గ్రామప్రజల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందంటూ చుక్కా పాల్‌రాజ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు అంకాళ్ల పృథ్వీరాజ్‌, శృంగారపాటి కార్తీక్‌ వాదనలు వినిపించారు.

Next Story