చిరంజీవి 'భోళాశంకర్' మూవీకి ఏపీ సర్కార్‌ షాక్‌

ఈ నెల 11న రిలీజ్ కానున్న చిరంజీవి 'భోళాశంకర్' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది.

By అంజి  Published on  10 Aug 2023 2:00 PM IST
ap govt , bholashankar movie, ticket price, Tollywood

చిరంజీవి 'భోళాశంకర్' మూవీకి ఏపీ సర్కార్‌ షాక్‌

మెగాస్టార్‌ చిరంజీవి 'భోళాశంకర్' మూవీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఈ నెల 11న రిలీజ్ కానున్న చిరంజీవి భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. పెద్ద హీరోలకు సంబంధించి ఏ సినిమా అయినా విడుదల అవుతున్న టికెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే భోళాశంకర్ సినిమాకు చిత్ర దర్శక, నిర్మాతలు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి.

దీంతో అప్లికేషన్‌ను తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తోందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇదంతా రాజకీయ కక్షతోనే చేస్తున్నారని సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుక సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన 'భోళాశంకర్' సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ వచ్చిన విషయం తెలిసిందే. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లు కొన్ని స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి గ్రాండ్ గా ఈ సినిమాను రూపొందించారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటించింది. కీర్తి సురేశ్ మెగాస్టార్ కు చెల్లెలిగా నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఇందులో సుశాంత్, వెన్నెల కిశోర్, మురళీశర్మ, రవిశంకర్, తులసి తదితరులు నటించారు.

Next Story