ఆర్‌ఆర్‌ఆర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Government Green Signal to hike RRR Movie ticket price.సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో
By తోట వంశీ కుమార్ Published on 17 March 2022 8:11 PM ISTసినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)' ఒకటి. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందానికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో ప్రకారం.. దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్ర నిర్మాణానికి రూ.100కోట్లు బడ్జెట్ దాటితే.. ఆయా చిత్రాలు విడుదలైన పది రోజుల వరకు టికెట్ రేటును పెంచుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ జీవోను అనుసరించి సినిమా టికెట్‌పై మరో రూ.75 పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ, దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి రూ.336 కోట్లు ఖర్చుచేసినట్లు ప్రభుత్వానికి సమర్పించిన వినతి పత్రంలో నిర్మాతలు పేర్కొన్నారు. అన్నీ పరిశీలించిన అనంతరం ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సినిమా రన్‌టైమ్ ఎంతంటే..?
'రౌద్రం రణం రుధిరం' సెన్సార్ పూరైంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్ర నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, సముద్ర ఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు.