డైరెక్టర్ ఆర్జీవీకి భారీ ఊరట..ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 6 March 2025 12:13 PM IST
డైరెక్టర్ ఆర్జీవీకి భారీ ఊరట..ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఊరట లభించింది. గుంటూరు సీఐడీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. ఆర్జీవీ ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం రామ్‌గోపాల్ వర్మపై నమోదైన కేసుల విచారణపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో 2019 సంవత్సరంలో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ మూవీపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రభుత్వం తరఫు లాయర్‌ను ప్రశ్నించింది.
కాగా, సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశానని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాననే ఆరోపణలతో బండారు వంశీకృష్ణ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందని క్వాష్ పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి తరువాతే 2019లో ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమా విడుదల చేశామని పిటిషన్‌లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని విచారణపై స్టే ఇవ్వాలని ఆర్జీవీ హైకోర్టును కోరారు.