ప్రముఖ తెలుగు, కన్నడ నటి శ్రీలీల తల్లి స్వర్ణలతపై బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు మీడియా కథనాల ప్రకారం.. అక్టోబర్ 3న కోరమంగళలోని తన అపార్ట్‌మెంట్‌లో తన మాజీ భార్య స్వర్ణలత అక్రమంగా ప్రవేశించిందని ఆరోపిస్తూ అడుగోడి పోలీస్ స్టేషన్‌లో భర్త సూరపనేని సుభాకర్ రావు ఫిర్యాదు చేశారు. తన అపార్ట్మెంట్లోకి స్వర్ణలత తాళం పగలకొట్టి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కోన్నారు సుభాకర్ రావు. వృత్తిరీత్యా వైద్యురాలైన స్వర్ణలత.. ఆమె భర్త సుభాకర్ రావు నుండి విడిపోయి 20 సంవత్సరాలకు పైగా అయ్యింది. అప్పటి నుంచి వీరు విడివిడిగా నివసిస్తున్నారు.
అలయన్స్ యూనివర్శిటీలోకి కొంతమంది వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి రిజిస్ట్రార్‌ను బెదిరించినందుకు సంబంధించి స్వర్ణలతపై అనేకల్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె రెండో నిందితురాలిగా పేర్కొనబడి ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైంది. గతేడాది అక్టోబర్‌లో పెళ్లి సందడి కథానాయిక శ్రీలీల తండ్రి పేరుతో వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన కూతురంటూ టాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలను సుభాకర్ రావు ఖండించారు. శ్రీలీల తన కూతురు కాదని మీడియాకు స్పష్టం చేసిన ఆయన, ఆమె తన మాజీ భార్య కూతురు అని వెల్లడించారు.
ఇదిలా ఉంటే శ్రీలీల తెలుగు, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె రవితేజతో కలిసి 'ధమాకా' సినిమాలో కనిపించనుంది. రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమా కోసం ఆమెను తీసుకున్నారు. మైనింగ్ బారన్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డితో కలిసి తన తొలి చిత్రం 'జూనియర్'లో ఆమె ప్రధాన కథానాయికగా కూడా నటించింది.