అమితాబ్ బచ్చన్ ఢిల్లీలోని తన ఇల్లు 'సోపాన్' ను అమ్మేశారని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఆయన తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ ఆ ఇంట్లో నివసించేవారు. ఆ ఇంటిని అమ్మేయడం ద్వారా బాలీవుడ్ మెగాస్టార్ 23 కోట్ల రూపాయలు ఆర్జించారని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ బంగ్లాను నెజోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల సీఈఓ అవ్నీ బాడర్ కొనుగోలు చేశారు. ఆయనకు దశాబ్దాలుగా బచ్చన్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఈ బంగ్లా 418.05 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ముంబైకి వెళ్లే ముందు బిగ్ బి తన తల్లిదండ్రులతో కలిసి ఇక్కడే నివసించారు. ఈ రెండంతస్తుల నివాసం బచ్చన్ కుటుంబానికి మొదటి ఇల్లుగా చెప్పబడుతోంది.
హరివంశ్ రాయ్ బచ్చన్ ఆ ఇంట్లో 1980 వరకు కవితా సమావేశాలను నిర్వహించేవారు. అమితాబ్ బచ్చన్‌కు ముంబైలోని జుహు ప్రాంతంలో ఐదు విశాలమైన బంగ్లాలు ఉన్నాయి. వాటికి జనక్, జల్సా, ప్రతీక్ష, వత్సా, అమ్ము అనే పేర్లు పెట్టారు. "ఇది పాత నిర్మాణం, కాబట్టి మేము నిర్మాణాన్ని కూల్చివేసి మా అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తాము. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాము. ఈ ఆఫర్ రాగానే, మేము వెంటనే ఒప్పుకున్నాం"అని కొత్త యజమాని చెప్పారు. అమితాబ్ ముంబైకి వెళ్లడానికి ముందు ఇక్కడ నివసించారు, తరువాత ఆయన తల్లిదండ్రులు అమితాబ్ దగ్గరకు వెళ్లారు. ఏళ్ల తరబడి ఆ ఇంట్లో ఎవరూ నివసించడం లేదు. మార్కెట్ ధరలకు అనుగుణంగా లావాదేవీలు జరుగుతున్నాయని దక్షిణ ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రదీప్ ప్రజాపతి తెలిపారు. అమితాబ్ ఇటీవలే అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా రోడ్‌లోని అల్టాంటిస్ భవనంలో ₹31 కోట్ల విలువైన తన డూప్లెక్స్‌ను అద్దెకు ఇచ్చారు.