'సుశాంత్ ఇలా చేస్తాడని అనుకోలేదు'.. జ్ఞాపకాలను పంచుకున్న ఫ్రెండ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఐదవ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
By Medi Samrat
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఐదవ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ సన్నిహితుడు, నటుడు అలోక్ పాండే కూడా తన గురించి కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు. సుశాంత్ మరణం ఇప్పటికీ అతనిని ఎలా కదిలిస్తుందో చెప్పాడు.
సుశాంత్ మరణవార్త వచ్చిన రోజు తాను గ్రామంలో ఉన్నానని అలోక్ పాండే చెప్పాడు. తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న సందేశం రాగానే నమ్మలేకపోయానని.. 'ఎవరో తమాషా చేస్తున్నారని నేను అనుకున్నాను.. న్యూస్ ఛానల్‌లో చూసి నమ్మి చలించిపోయాను. సుశాంత్ చాలా పాజిటివ్, ఎనర్జిటిక్, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని అలోక్ అన్నారు. సుశాంత్ లాంటి వ్యక్తి ఇలా చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. 'సుశాంత్ చాలా ఉత్సాహంగా జీవితాన్ని గడిపాడు.. అతని మాటలను బట్టి చూస్తే ప్రపంచంలో ఏ కల కూడా అసాధ్యం అనిపించేది కాదన్నాడు.
తన చివరి సంభాషణ సుశాంత్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిందని పేర్కొన్నాడు. లక్నో సెంట్రల్ సినిమా సమయంలో కూడా సుశాంత్ తనకు మద్దతు ఇచ్చాడని.. తన పనిని అతడు మెచ్చుకున్నాడని అలోక్ వివరించాడు. 'నా సినిమా విజయం సాధించినప్పడు 'నువ్వు అద్భుతమైన నటుడు' అని వెంటనే మెసేజ్ చేశాడు. అతడు చాలా ధైర్యంగల వ్యక్తి అన్నాడు.
చిచ్చోరే సినిమా తర్వాత సుశాంత్‌తో తన కమ్యూనికేషన్ తగ్గిపోయిందని, అయితే ఇంత పెద్ద షాక్ జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు. అతని నిష్క్రమణ నాకు షారుఖ్, అమీర్ లేదా సల్మాన్ నిష్క్రమణ లాంటిది. సుశాంత్ నాకు సూపర్ స్టార్, అతనితో అనుబంధం నాకు చాలా ప్రత్యేకమైనది. సుశాంత్‌ను కేవలం నటుడిగానే కాకుండా ఇతరుల భావాలను గౌరవించే, ఎల్లప్పుడూ పాజిటివిటీని వ్యాప్తి చేసే మనిషిగా గుర్తు చేసుకుంటానని పేర్కొన్నాడు.