సంధ్యా థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయలో అల్లు అర్జున్‌పై వస్తున్న విమర్శలపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Medi Samrat Published on 21 Dec 2024 9:15 PM ISTసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయలో అల్లు అర్జున్‌పై వస్తున్న విమర్శలపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తనను కలచివేసిందని.. ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు సంతాపం తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లబ్బాయి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. జరిగిన ఘటనలో ఎవరి తప్పు లేదు.. అదొక దురదృష్టకరమైన యాక్సిడెంట్. మేం ఒక మంచి సినిమా అందించాలని శ్రమించాం.. థియేటర్ వాళ్లు కూడా ఒక మంచి సినిమా వేయాలని తాపత్రయపడ్డారు.. పోలీసులు కూడా శక్తిమేర రక్షణ కల్పించాలని కృషి చేశారు.. అయినప్పటికీ కూడా ఆ ఘటన జరిగింది. అందుకు ఎవరూ బాధ్యులు కారు. ఆ ఘటనకు దారి తీసిన పరిస్థితులు ఎవరి నియంత్రణలో లేవు. ఆ కుటుంబానికి జరిగింది తీరని నష్టం అన్నారు.
సినీ రంగానికి చెందిన వ్యక్తిగా నా జీవిత లక్ష్యమే.. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టయిన్ చేయడం. థియేటర్ వచ్చిన జనాలను నవ్వుతూ పంపించాలన్నదే నా ఉద్దేశం. ప్రేక్షకుల మనసులను గెలిచి, సంతోషంగా పంపించాలని భావించే వ్యక్తిని. థియేటర్ ను ఒక ఆలయంలా భావించే వ్యక్తిని నేను.. అలాంటి థియేటర్ లో ఘటన జరిగిందంటే నాకంటే బాధపడే వ్యక్తి మరొకరు ఉంటారా.? చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రతి గంటకు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నానని తెలిపారు. ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిస్ కమ్యూనికేషన్ జరుగుతోందని అల్లు అర్జున్ తెలిపారు. థియేటర్ ఘటనలో తన క్యారెక్టర్‌ను కించపరిచారని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వహననం జరిగిందని, కొందరి వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించినట్లు బన్నీ చెప్పారు. పుష్ప-2 సినిమా హిట్టయినా తాను ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నట్లు తెలిపారు. తాను ఎవ్వరినీ తప్పుపట్టడం లేదని.. ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని అల్లు అర్జున్ వెల్లడించారు.
సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే తన జీవిత ఆశయమని, సినిమా థియేటర్లు తనకు దేవాలయంతో సమానమని అల్లు అర్జున్ చెప్పారు. అలాంటి ఆలయంలో ఒకరు ప్రాణాలు కోల్పోతే తన కంటే ఎక్కువ బాధపడే వారుండరని బన్నీ తెలిపారు. చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై గంటగంటకు సమాచారం తెలుసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, ఇప్పుడిప్పుడే కదులుతున్నట్లు వైద్యుల ద్వారా తెలిసిందని వెల్లడించారు. ఇంత బాధాకరమైన వాతావరణంలో ఆ ఒక్క విషయం కాస్త ఊరట కలిగిస్తోందని ఐకాన్ స్టార్ చెప్పారు.
సంధ్యా థియేటర్ ఘటనలో తనపై తప్పుడు, అసత్య ప్రచారం జరుగుతోందని, అందుకే ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం, రాజకీయ నేతలు, ఏ ప్రభుత్వ శాఖపై తాను నిందలు వేయడం లేదని చెప్పారు. కానీ, తొక్కిసలాట జరిగినప్పుడు తాను తప్పుగా ప్రవర్తించానని అనేక ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిందలు మోపే వారు చెప్పినట్లు తాను తప్పుగా ప్రవర్తించలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. వారు వేసిన నిందలు ఎంతో బాధించాయని అల్లు అర్జున్ తెలిపారు.
ఘటన జరిగినప్పట్నుంచీ అన్ని కార్యక్రమాలను ఆపేసుకుని 15 రోజులుగా ఇంట్లోనే బాధపడుతూ కూర్చున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు. అలాంటిది ఆ రోజు తాను ఏదేదో మాట్లాడినట్లు ప్రచారం చేస్తుంటే చాలా బాధ కలుగుతోందని ఆయన చెప్పారు. కాళ్లు, చేతులు విరిగిపోతే పర్లేదని తాను చెప్పినట్లు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు