ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, అల్లు అర్జున్ నానమ్మ అయిన అల్లు కనకరత్నమ్మ (94) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నానమ్మ మరణవార్త తెలిసిన వెంటనే, ముంబైలో తన సినిమా షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇంటికి చేరుకుని నానమ్మ భౌతికకాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న తన బావమరిది అల్లు అరవింద్‌ను, తీవ్ర వేదనలో ఉన్న అల్లు అర్జున్‌ను చిరంజీవి ఓదార్చారు. చిరంజీవిని చూడగానే అల్లు అర్జున్ మరోసారి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది.