ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది,

By Medi Samrat  Published on  17 Oct 2023 5:35 PM IST
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. 2021 ఆగస్ట్‌లో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించగా.. నేడు కళాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు. అల్లు అర్జున్‌, అలియా భట్, కృతి సనన్, వహీదా రెహమాన్ వంటి నటీనటులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.

అల్లు అర్జున్ ఈ ఏడాది ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 'పుష్ప: ది రైజ్' చిత్రంలో తన శక్తివంతమైన, అద్భుతమైన నటనకు అల్లు అర్జున్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డుతో సత్కరించబ‌డ‌టం డబుల్ అచీవ్‌మెంట్‌గా అల్లు అర్జున్ అభివర్ణించారు.

బాలీవుడ్ న‌టి అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' చిత్రంలో తన అద్భుతమైన నటనకు ఉత్త‌మ న‌టి అవార్డును అందుకుంది. అలియా భట్ తన వివాహ చీరను ధరించి రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అలియా భర్త రణబీర్ కపూర్‌తో కలిసి అవార్డు పంక్ష‌న్‌కు వచ్చింది.

'మిమి' చిత్రంలో తన నటనకు గాను కృతి స‌న‌న్ కూడా అలియాతో కలిసి ఉత్తమ నటి అవార్డును పంచుకుంది. ఈ చిత్రంలో ఆమె అద్దె తల్లి పాత్రను పోషించింది. ఇలాంటి అద్భుతమైన పాత్రలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కృతి స‌న‌న్ పేర్కొంది.

Next Story