మీర్జాపూర్ యూనిట్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లు రద్దు
Allahabad High Court quashes FIR against Mirzapur makers, directors, writers. మీర్జాపూర్ వెబ్ సిరీస్.. ఎంతగా హిట్ అయ్యిందో.. అంతకంటే
By Medi Samrat
మీర్జాపూర్ వెబ్ సిరీస్.. ఎంతగా హిట్ అయ్యిందో.. అంతకంటే ఎక్కువ వివాదాలు ఆ షోను చుట్టుముట్టాయి. కోర్టుల్లో కూడా పలు కేసులు నమోదయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన మీర్జాపూర్ రెండు సీజన్ లు విడుదలయ్యాయి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజాల్, దివ్యేందు శర్మ, కుల్‌భూషణ్ ఖర్బందా, రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి తదితరులు నటించారు. తాజాగా నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిధ్వానీలపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దర్శక-రచయితలు కరణ్ అన్షుమాన్, గుర్మీత్ సింగ్, పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కూడా హైకోర్టు రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వెబ్ సిరీస్ రూపొందించారని ఆరోపిస్తూ కొత్వాలి దేహత్ పోలీస్ స్టేషన్ (మీర్జాపూర్)లో స్థానిక జర్నలిస్ట్ అరవింద్ చతుర్వేది జనవరి, 17న ఫిర్యాదు చేశారు.
దీంతో ఐపీసీ సెక్షన్ 295-ఏ, 504, 505, 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67-ఏ కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వెబ్ సిరీస్‌లో మీర్జాపూర్ పట్టణాన్ని చెడుగా చిత్రీకరించి మత, సామాజిక, ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. జనవరి, ఫిబ్రవరిలో వీరిని అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశిలిచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ పూర్తిగా కల్పితమని, అన్ని మతాలను తాము గౌరవిస్తామని అంతకుముందు ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. వీరి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌లను కోర్టు రద్దు చేసింది.