బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన సినిమా 'పద్మావత్' విడుదలవ్వకముందు ఎంత వివాదం చోటు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు మీదకు వచ్చి నానా రభస చేశారు. ఇక సినిమా విడుదలయ్యాక అందరూ సైలెంట్ అయిపోవడం మనకు తెలిసిందే.. ఎంతో గొప్పగా తీశారంటూ పలువురు మెచ్చుకున్నారు. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన సినిమా 'గంగూభాయ్ కతియవాడి' విడుదలకు సిద్ధమవుతోంది. ఆలియాభట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉండంటూ పలువురు మెచ్చుకుంటూ ఉండగా అప్పుడే వివాదాలు మొదలయ్యాయి.
ఈ చిత్రంలో అలియా భట్ వేశ్య పాత్రలో నటిస్తుంది. ముంబైలోని కామాతిపురాలో సెక్స్ వర్కర్ అయిన గంగూభాయ్ కతియావాడి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఎంఎల్ఏ అమిన్ పటేల్ గంగూభాయ్ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసాడు. కామాతిపురాను అవమానించేలా ఈ సినిమా ఉందంటూ ఆయన మండి పడ్డారు. ఆ ప్రాంతాన్ని జనాల్లో తక్కువ చేసి చూపిస్తున్నారని, హేళన చేస్తున్నారని ఆరోపించాడు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు ఇప్పుడు సైంటిస్టులు అయ్యారని, దేశం గర్వపడే స్థాయిలో ఉన్నారని అమిన్ తెలిపాడు. కానీ గంగూబాయ్ సినిమాలో మాత్రం ఇప్పటికీ అది సెక్స్ వర్కర్స్ అడ్డా అన్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసాడు. సినిమాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. సినిమాలో మంచిగా చూపించారో లేదో తెలియకుండానే అప్పుడే వివాదం మొదలైంది.