సినీ నటుడు నాగార్జున విషయంలో ఇకపై అలా జరగకూడదు..!
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.
By - Medi Samrat |
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీలను ఉపయోగించి తన పేరు, స్వరం, ఫొటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడాన్ని సవాల్ చేస్తూ నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఆయన పేరును గానీ, స్వరాన్ని గానీ ఎలాంటి వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్స్ వంటి టెక్నాలజీల ద్వారా నాగార్జున గుర్తింపును దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
నాగార్జున తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రవీణ్ ఆనంద్, వైభవ్ గాగ్గర్, వైశాలి మిత్తల్ వాదనలు వినిపించారు. నాగార్జునకు ఉన్న ప్రజాదరణను ఆసరాగా చేసుకుని కొందరు ఆయన గుర్తింపుతో నకిలీ వాణిజ్య ప్రకటనలు, అశ్లీల కంటెంట్, టీ-షర్టుల అమ్మకాలు వంటివి చేస్తున్నారని తెలిపారు. న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, నాగార్జున వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చూసేందుకు ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.