కొన్ని కొన్ని ఫీల్డ్ లలో ఏదీ కలిసి రాకపోతే పేర్లు మార్చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమా రంగంలో అలానే పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కొణిదెల శివ శంకర వరప్రసాద్ కూడా చిరంజీవి అని పేరు మార్చుకున్నాకనే చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ అయ్యారనే నమ్ముతారు. ఎంతో మంది హీరోయిన్లు స్క్రీన్ నేమ్ లను మార్చుకున్నారు. కొద్దిరోజుల కిందట మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన పేరును మార్చుకుని సర్ ప్రైజ్ చేశాడు. తన పేరులో తన తల్లి పేరును చేర్చుకున్నాడు సాయి దుర్గ తేజ్.
తాజాగా లెజెండరీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముద్దుల కొడుకు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ తన పేరును ఆకాశ్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు. "నా పేరులో మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు నా పేరు ఆకాశ్ పూరీ కాదు. ఇప్పటి నుంచి నేను ఆకాశ్ జగన్నాథ్" అని తెలిపాడు. ఆకాశ్ చిరుత, బుజ్జిగాడు సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. ఇక హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నాడు ఆకాశ్. పేరు మార్చుకున్నాక సరైన హిట్ పడుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.