సుస్మితా సేన్‌కు గుండెపోటు.. స్టంట్ వేసిన డాక్టర్లు

తనకు గుండె పోటు వచ్చిందని బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్ పెట్టిన పోస్టుతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

By అంజి  Published on  2 March 2023 6:00 PM IST
Actress Sushmita, Bollywood, Heart Attack

సుస్మితా సేన్‌కు గుండెపోటు (ఫైల్‌ ఫొటో)

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి సుస్మితా సేన్ తన వ్యక్తిగత వార్తతో అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ నోట్‌లో.. కొన్ని రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చిందని, యాంజియోప్లాస్టీ చేయించుకోవలసి వచ్చిందని వెల్లడించింది. లోపల స్టంట్ కూడా వేశారని తెలిపింది. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని, కోలుకుంటున్నానని సుస్మితా సేన్ తన అభిమానులకు తెలిపింది. ఎంటర్టన్మెంట్‌ ఇండస్ట్రీలో ఫిట్‌టెస్ట్ స్టార్‌లలో ఒకరైన సుస్మితా సేన్‌కు గుండెపోటు వచ్చిందని తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం బాగానే ఉందని చెప్పడంతో అభిమానులు కాస్త శాంతించారు.

''గుండెను ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా ఉంచుకోండి.. అలా ఉంటే.. ఆ గుండె మీకు ఆపత్కాల సమయంలో అండగా ఉంటుంది అని నా తండ్రి చెప్పాడు. కొన్ని రోజుల కిందట నేను గుండెపోటుకు గురయ్యాను. డాక్టర్లు ఆంజియోప్లాస్టీ చేశారు. స్టంట్ వేశారు. నా గుండె చాలా పెద్దదని మా కార్డియాలజిస్ట్ చెప్పాడు. నేను ఎంతో మందికి ధన్యవాదాలు చెప్పాలి. అవన్నీ ఇంకో పోస్ట్‌లో చెబుతాను. నేను మీకో శుభవార్త చెప్పాలని ఈ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. మళ్లీ షూటింగ్‌లంటూ లైఫ్‌తో బిజీగా ఉండేందుకు రెడీగా ఉన్నాను'' అంటూ సుస్మితా సేన్‌ తన ఇన్‌స్టాలో వెల్లడించింది.

సుస్మితా సేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన హెల్త్‌ అప్‌డేట్‌ను పంచుకున్న వెంటనే.. పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వృత్తిపరంగా, సుస్మితా సేన్ చివరిగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ షో ఆర్య రెండవ సీజన్‌లో కనిపించింది. ప్రస్తుతం ఆమె మూడో సీజన్‌కు సిద్ధమవుతోంది.


Next Story