విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
మరాఠీ సినిమాలతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు యోగేష్ మహాజన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
By Medi Samrat Published on 20 Jan 2025 12:09 PM ISTమరాఠీ సినిమాలతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు యోగేష్ మహాజన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. యోగేష్ మహాజన్ మరణానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబం సమాచారం ఇచ్చింది. మన అభిమాన యోగేష్ మహాజన్ ఆకస్మికంగా మరణించారని మేము చాలా బాధతో తెలియజేస్తున్నాం. ఆదివారం 19 జనవరి 2025న ఆయన గుండెపోటుతో మరణించారు. ఇది మా కుటుంబం, బంధువులు, స్నేహితులందరికీ భయంకరమైన షాక్ అని ప్రకటనలో పేర్కొన్నారు. యోగేష్ మహాజన్ అంత్యక్రియలు ఈరోజు బొరివలి వెస్ట్ ముంబైలోని ప్రగతి హైస్కూల్ సమీపంలోని గోరారి-2 శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
యోగేష్ మహాజన్ అనేక మరాఠీ చిత్రాలతో పాటు అనేక హిందీ పౌరాణిక ధారావాహికలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. యోగేష్ హిందీ సీరియల్ 'శివశక్తి-తప్, త్యాగ్, తాండవ్' షూటింగ్ కోసం ఉమర్‌గావ్‌లో ఉన్నారు. ఈ సీరియల్‌లో ఆయన శుక్రాచార్య పాత్రలో నటించారు. ఆయన ఆకస్మిక మరణానికి కారణం గుండెపోటు.
మీడియా కథనాల ప్రకారం.. శనివారం సాయంత్రం షూటింగ్ ముగిసిన వెంటనే యోగేష్ ఆరోగ్యం క్షీణించింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్లారు. రాత్రి హోటల్ గదిలో పడుకున్న ఆయన ఆదివారం ఉదయం షూటింగ్ కోసం సెట్‌కు రాలేదు. దీంతో సీరియల్ బృందంలోని పలువురు ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఫోన్ తీయలేదు. దీంతో గది తలుపు తెరిచిచూడగా.. మంచం మీదనే తుదిశ్వాస విడిచారు.
యోగేష్ జలగావ్‌లో సెప్టెంబర్ 1976లో రైతు కుటుంబంలో జన్మించాడు. యోగేష్ మరాఠీ, హిందీ, భోజ్‌పురి సినిమాల్లో తన కృషి, అంకితభావంతో తనదైన ముద్ర వేశారు. వినోద ప్రపంచానికి రాక ముందు ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు. ఆయన భోజ్‌పురిలో తన నటనను ప్రారంభించారు. 'ముంబైచే షహానే', 'సంసార్చి మాయ' వంటి మరాఠీ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.