మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. శనివారం శివాజీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలో కొంతమందికి నాపై వ్యతిరేకత ఉంది. ఇప్పుడది చాలా క్లియర్‌గా అర్థం అవుతోందన్నారు. అందుకే తనపై కుట్ర చేశారని శివాజీ ఆరోపించారు. జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు.
తన మాటలను వక్రీకరించి కొందరు తనపై కుట్ర చేశారని శివాజీ ఆరోపించారు. ఇండస్ట్రీలో కొంతమందికి ఇప్పటికే తనపై వ్యతిరేకత ఉందని శివాజీ చెప్పారు. ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో ఆవేశంలో రెండు తప్పు పదాలు ఉపయోగించానని, వాటికిగాను ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పానన్నారు. మహిళా కమిషన్ ప్రభుత్వ సంస్థ కావడంతో గౌరవంతో వచ్చి వివరణ ఇచ్చానని తెలిపారు.