సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూత
Actor Sarath Babu passes away at 73. తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియన్ నటుడు శరద్‌బాబు కన్నుమూశారు.
By Medi Samrat Published on 22 May 2023 9:45 AM GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియన్ నటుడు శరద్‌బాబు కన్నుమూశారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్‌బాబు ఆరోగ్యం ఉదయం మరింత క్షీణించింది. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో చనిపోయారు. శరత్ బాబు తెలుగులోనే కాదు.. తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబు ఆదరణ పొందారు. గత ఏడాది విడుదలైన వకీల్ సాబ్‌లో ఓ అతిథి పాత్రలో కనిపించారు శరత్‌బాబు వందలాది చిత్రాల్లో విభిన్నపాత్రలతో ఆకట్టుకున్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఆయన జన్మించారు.
శరత్ బాబు తండ్రికి పెద్ద హోటల్ ఉండేది. తనలాగే కుమారుడు బిజినెస్ చూసుకుంటాడని తండ్రి భావించారు. కానీ శరత్ బాబుకు మాత్రం తాను పోలీస్ ఆఫీసర్ కావాలన్న కోరిక బలంగా ఉండేది. అప్పట్లో అతని మిత్రులు, సన్నిహితులు నువ్వు హీరోలా ఉంటావ్.. సినిమాల్లో ప్రయత్నించవచ్చు కదా అని సలహా ఇచ్చారు. ఆ మాటలు కాస్తా శరత్ బాబు తల్లి దృష్టికి వచ్చాయి. తండ్రికి ఇష్టం లేకపోయినా.. తల్లి ప్రోత్సాహంతో మద్రాసులో అడుగుపెట్టారు. మద్రాస్ చేరుకున్న శరత్ బాబు అవకాశాల కోసం వెతికారు. అలా సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో రామవిజేత అనే సంస్థ కొత్త నటీనటులు కావాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ద్వారానే శరత్ బాబుకు హీరోగా అవకాశం లభించింది. అలా శరత్ తొలిసారి నటించిన చిత్రం రామరాజ్యం. ఆ సినిమాతోనే తన పేరు శరత్‌బాబుగా మార్చుకున్నారు.. అప్పటికే ఎంతో పేరున్న చంద్రకళ ఇందులో కథానాయికగా నటించింది. తొలి సినిమాలోనే ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య వంటి మేటి నటుల సరసన నటించే అవకాశం దొరికింది. ఆ తర్వాత బంగారు మనిషి, అమెరికా అమ్మాయి, దొరలు-దొంగలు వంటి చిత్రాల్లో నటించారు. సీతాకోకచిలుక, అభినందన, హలో బ్రదర్, సాగరసంగమం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, చెట్టుకింద ప్లీడరు, సిసింద్రీ, అపద్బాంధవుడు వంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. బంగారు మనిషి సినిమాలో ఎన్టీఆర్‌కు ఫ్రెండ్‌గా నటించారు. శృంగారరాముడు సినిమాలో విలన్‌గా నటించారు.
రమాప్రభతో శరత్ బాబుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి చేసుకున్నారు. పద్నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు.