ఆర్థిక నేరగాడు సుకేష్ కు సంబంధించిన 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న నోరాను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) విచారించింది. ఆమె ఉదయం 11 గంటలకు విచారణకు వెళ్లగా.. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు కార్యాలయం నుండి బయటకు పంపినట్లు అధికారులు తెలిపారు. సుకేష్ నుంచి ఆమెకు అందిన బహుమతుల గురించి ప్రశ్నించారు.
ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య నుంచి రూ.200 కోట్లు దోపిడీ చేశారంటూ గతేడాది ఢిల్లీ పోలీసులు సుకేష్, ఆయన భార్య లీనా మరియా పాల్ తదితరులపై చార్జిషీట్ దాఖలు చేశారు. సుకేష్ తనకు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడన్న ఆరోపణలను నోరా ఫతేహి తోసిపుచ్చారు. చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతిఫలంగా సుకేష్ భార్య కారును బహుమతిగా ఇచ్చిందని ఆమె పోలీసులకు తెలిపింది.
ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఆగస్టులో ఆమెపై ఈడీ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారుగా ఉందని ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీదారుడని ఆమెకు తెలుసునని ఈడీ భావిస్తోంది. వీడియో కాల్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కీలక సాక్షులు తెలిపారు.