ప్రముఖ హాస్యనటుడు మనోబాల కన్నుమూత
Actor-director Manobala passes away at 69. ప్రముఖ తమిళ హాస్యనటుడు, దర్శకుడు, నిర్మాత మనోబాల కన్నుమూశారు.
By Medi Samrat
ప్రముఖ తమిళ హాస్యనటుడు, దర్శకుడు, నిర్మాత మనోబాల కన్నుమూశారు. ఈరోజు చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాలేయ సమస్యలతో బాధపడుతున్న మనోబాల.. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో యాంజియో చికిత్స పొందారు. అప్పటి నుంచి సాలిగ్రామంలోని స్వగృహంలో వైద్యం పొందుతున్నారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. మనోబాల 1979లో భారతీరాజా చిత్రం పుతియా వార్పుగల్‌తో నటుడిగా, సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1982లో కార్తీక్, సుహాసిని నటించిన ఆగయ గంగై చిత్రం దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఆయన 24 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
శివాజీ గణేశన్ నటించిన పరంబరియమ్, విజయకాంత్ హిట్ చిత్రం ఎన్ పురుషాంతన్ ఎనక్కు మట్టుమ్తాన్, రజనీకాంత్ ఊర్కావలన్, సత్యరాజ్ నటించిన మల్లువెట్టి మైనర్, మోహన్ నటించిన పిళ్లై నీల.. మనోబాల దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాలు. ఐదు దశాబ్దాల ఆయన కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. మనోబాలకు దివంగత లెజెండరీ నటుడు వివేక్‌తో కలిసి చేసిన సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
మనోబాల చివరగా కాజల్ అగర్వాల్ ఘోస్టి, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన కొండ్రాల్ పావం, తెలుగులో చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేర్ వీరయ్యలో కనిపించారు. మనోబాలకు భార్య ఉష, కుమారుడు హరీష్ ఉన్నారు. మనోబాల మరణవార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో తమ సంతాపాన్ని తెలియజేశారు. రజనీకాంత్. “నా ప్రియమైన స్నేహితుడు మనోబాల మరణించినందుకు నేను చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక అని ట్వీట్ చేశారు.