బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాళ్లోకెళితే.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్ సమీపంలో ఆసిఫ్ బాస్రా ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఆయన ఉరివేసుకుని చనిపోయినట్టు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆసిఫ్ బాస్రా మృతిపై సీనియర్ పోలీసు అధికారులు ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు ప్రారంభించిందని పోలీసు ఉన్నతాధికారి విముక్త్ రంజన్ వెల్లడించారు. ఆసిఫ్ యుకెకు చెందిన మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఆసిఫ్ తన పెంపుడు కుక్కకు వాడే గొలుసుతోనే ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు ప్రాథమిక సమాచారం.
ఇదిలావుంటే.. టీవీ నటుడుగా ప్రసిద్ధి చెందిన ఆసిఫ్ 'పర్జానియా', బ్లాక్ 'ఫ్రైడేస వంటి విజయవంతమైన బాలీవుడ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. హాలీవుడ్ మూవీ 'అవుట్‌సోర్స్'లో కూడా కనిపించారు. అలాగే 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై' లో ఇమ్రాన్ హష్మీ తండ్రిగా కూడా నటించారు. అయితే ఆసిఫ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.