దళపతి విజయ్ పొలిటికల్ జర్నీపై అజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మార్పు తీసుకురాగలమనే విశ్వాసంతో అడుగులు వేస్తున్న వారందరూ విజయం సాధించాలని, రాజకీయాల్లోకి వచ్చిన తన మిత్రుడు, దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీని సాహసోపేతమైన నిర్ణయంగా అజిత్ అభివర్ణించారు. వ్యక్తిగతంగా తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని అజిత్ స్పష్టం చేశారు. పాలిటిక్స్ అంటే తనకు ఆసక్తి లేదని తెలియజేశారు.
భారతదేశంలో వివిధ మతాలు, జాతులు, భాషలు కలిగిన ప్రజలు సామరస్యంగా జీవించడం గొప్ప విషయమని అజిత్ అన్నారు. ఇంతటి వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశాన్ని ఏకతాటిపై నడిపించడం కేవలం రాజకీయ నాయకులకే సాధ్యమవుతుందన్నారు. ఇటీవల అజిత్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇందులో భాగంగా తాను రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని ఆయన వెల్లడించారు. దేశ నాయకులు తమ జీవితాలను ఎలా గడుపుతున్నారో అప్పుడే తనకు అర్థమైందని అజిత్ చెప్పారు. ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని బాధ్యతగా నడిపించడం చాలా కష్టమైన పని అని తాను అప్పుడు గ్రహించానన్నారు.