బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చిత్రాలు ఎంతో స్పెషల్.. అతడి సినిమా సెలెక్షన్ అద్భుతంగా ఉంటుందని చెబుతుంటారు. అందుకే అతడి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి. తాను ఏ చిత్రానికి సంతకం చేసినా తన ప్రేక్షకులపై ప్రభావం చూపేలా చూసుకుంటాడు. తాను హిందీ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల అమీర్ తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో అమీర్ తన నిర్ణయం గురించి మాట్లాడాడు. లాల్ సింగ్ చద్దా విడుదలకు ముందు ప్రజలు దీనిని 'మార్కెటింగ్ పథకం' అని పిలుస్తారని.. అతను తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడానికి కారణం చెప్పాడు.
పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాననే బాధ తనను వెంటాడుతూ ఉండేదని అన్నారు. వారికి ఏంకావాలో నాకు తెలియడం లేదని.. అదే పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆ సమయంలో నా మీదే కాదు సినిమా మీద కూడా కోపం వచ్చింది. సినిమాలే నాకు, నా కుటుంబానికి మధ్య గ్యాప్‌కి కారణం అని అర్ధమయ్యింది. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా. అంతేకాకుండా సినిమాల్లో నటించడం కానీ, నిర్మించడం కానీ చేయకూడదనుకున్నాను. గతంలోనే నేను నా రిటైర్‌మెంట్‌ను ప్రకటించాలనుకున్నాను. అందుకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. నా సినిమాల మధ్య సాధారణంగా 3, 4 ఏళ్లు విరామం తీసుకుంటాను. కాబట్టి లాల్ సింగ్ చద్దా తర్వాత, మరో 3, 4 సంవత్సరాల వరకు గ్యాప్ ఇచ్చి నిశ్శబ్దంగా సినిమాల నుంచి తప్పుకోవచ్చని అమీర్ ఖాన్ వెల్లడించారు.
పరిశ్రమ నుండి వైదొలగాలని ఆలోచించిన తర్వాత, తన కుమార్తె ఇరా ఖాన్‌తో కలిసి చర్చించానని అమీర్ తెలిపారు. అమీర్ పిల్లలు కూడా అతను తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడని, తన జీవితంలో బ్యాలెన్స్‌ని చూసుకోవాలని చెప్పారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న రానుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్, నాగ చైతన్య కూడా నటించారు.