రాణించిన బాబర్ ఆజమ్.. పాక్ తో ఇంగ్లాండ్ మరింత కష్టపడాల్సిందేనా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Aug 2020 4:15 AM GMTఇతర దేశాలేమో కానీ ఇంగ్లాండ్ మాత్రం క్రికెట్ సిరీస్ లలో దూసుకుపోతోంది. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ముగియగానే, ఐర్లాండ్ తో వన్డే సిరీస్ పూర్తీ చేసేసింది ఇంగ్లాండ్. విండీస్ తో టెస్ట్ సిరీస్ 2-1 తో గెలుచుకోగా.. ఐర్లాండ్ తో వన్డే సిరీస్ ను కూడా 2-1 తో కైవసం చేసుకుంది. ఆగష్టు 5 నుండి పాకిస్థాన్ తో టెస్ట్ సిరీస్ ను మొదలుపెట్టింది ఇంగ్లాండ్. ఈ టెస్ట్ సిరీస్ ను గెలవాలంటే ఇంగ్లాండ్ మరింత కష్టపడాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.
ఓల్డ్ ట్రాఫోర్డ్ లో మొదలైన మొదటి టెస్టు మొదటి రోజున పాకిస్థాన్ జట్టు మంచి ఆటతీరును కనబరిచింది. వర్షం కారణంగా వచ్చిన బ్రేక్, వెలుతురు సరిగా లేకపోవడం వలన మ్యాచ్ ను ముందుగానే నిలిపివేయడం కారణంగా మొదటిరోజు ఆట కేవలం 49 ఓవర్ల పాటూ మాత్రమే సాగింది. మొదటి రోజు ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ 69, షాన్ మసూద్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జాస్ బట్లర్ మసూద్ ను 45 పరుగుల వద్ద అవుట్ చేసే రెండు అవకాశాలను వదులుకున్నాడు.
ఈ హాఫ్ సెంచరీ ద్వారా బాబర్ ఆజమ్ వరుసగా అయిదు టెస్టుల్లోనూ అయిదు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రికార్డు అందుకున్నాడు. గత అయిదు మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు కూడా చేశాడు బాబర్. ఈ మ్యాచ్ లో కూడా బాబర్ సెంచరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ బాబర్ ఆజమ్ ను విరాట్ కోహ్లీతో పోల్చాడు. విరాట్ కోహ్లీ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి వుంటే అందరూ మాట్లాడుకునే వారు.. కానీ బాబర్ ఆజమ్ కావడంతో ఎవరూ మాట్లాడడం లేదని అన్నాడు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ల లాంటి స్టార్స్ లిస్టులోకి బాబర్ ఆజమ్ చేరిపోయాడని.. 'ఫ్యాబ్ ఫైవ్' లిస్టులో అతడు కూడా ఉన్నాడని అభిప్రాయపడ్డాడు నాసిర్ హుస్సేన్.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 15 ఓవర్ల వరకూ మొదటి వికెట్ ను కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చింది. 16 పరుగులు చేసిన అబిద్ అలీని జోఫ్రా ఆర్చర్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అజర్ అలీ డకౌట్ గా వోక్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. బాబర్ ఆజమ్ 100 బంతుల్లో 69 పరుగులు, షాన్ మసూద్ 152 బంతుల్లో 46 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నారు.