Fact Check : ఆ ఏనుగుకు కేరళలో ఘనంగా వీడ్కోలు పలికారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jun 2020 4:33 PM ISTగత కొద్దిరోజులుగా కాషాయం రంగు వస్త్రాలు ధరించిన కొందరు ఏనుగుకు అంత్యక్రియలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇటీవల కేరళలో చనిపోయిన ఏనుగుకు ఇలా అంతిమసంస్కారాలు నిర్వహించి వీడ్కోలు పలికారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోను తీక్షణంగా పరిశీలిస్తే ఆ ఏనుగు శరీరం మీద ತರಳಬಾಳು(తరళబాళు) అని ఉంది. అది కన్నడలో రాశారు. కేరళ అధికార భాష మలయాళం.. కానీ అక్కడ ఉన్న ఏనుగు మీద కన్నడ అక్షరాలూ ఉండడంతో కేరళ ఘటనకు.. ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదు. కేరళలో చనిపోయిన ఏనుగుకు అంత్యక్రియలు చేస్తున్న ఫోటో అని చెప్పడంలో ఎటువంటి నిజం లేదు.
ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 'తరళబాళు ఏనుగు అంతిమసంస్కారాలు' అని పలు వార్తా కథనాలు వచ్చాయి. నవంబర్ 13, 2015న ఈ ఘటనపై ఆర్టికల్ రాశారు.
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలోని సిరిగెరె శ్రీ తరళబాళు జగద్గురు బ్రిహన్నమఠ్ లో ఈ ఏనుగును పలు సేవలకు ఉపయోగించారు. 2002 లో మంత్రి శమనురు శివశంకరప్ప 11 ఏళ్ల వయసు ఉన్న ఈ ఏనుగును మఠానికి బహుమతిగా ఇచ్చారు. ఈ ఏనుగు సినిమాలో కూడా కనిపించింది. 2006లో విడుదలైన కళ్ళరాళి హూవగి అనే సినిమాలో నటించడం వలన ఈ ఏనుగు 'గౌరీ' అనే పేరుతో బాగా ఫేమస్ అయింది. మఠానికి వచ్చే భక్తులు ఈ ఏనుగుతో ఫోటోలు తీయించుకునేవారు కూడా.
దాదాపు 13 సంవత్సరాల పాటూ సేవలు అందించిన ఏనుగు అనారోగ్యం కారణంగా నవంబర్ 8, 2015న మరణించింది. మహాస్వామి ఆదేశాల అనుగుణంగా ఆ ఏనుగుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బసు బణకర్ అనే భక్తుడు ఏనుగు అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫోటోలను నవంబర్ 8, 2015న ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
ఏనుగు గౌరికి సంబంధించిన మరిన్ని ఫోటోలను నవంబర్ 9, 2015న పోస్టు చేశారు.
తరళబాళు జగద్గురు బ్రిహన్నమఠ్ కూడా నవంబర్ 12, 2015న ఈ ఫోటోలనే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వన్ ఇండియా ఆ ఏనుగు ఫైల్ ఫోటోను, స్వామీజీలతో ఉన్న ఫోటోలను ప్రచురించింది. రిటైర్డ్ డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కుమారస్వామి శెట్టిహళ్లి కూడా గౌరీతో కలిసి తీసుకున్న తన ఫ్యామిలీ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
కేరళలో ఇటీవల చనిపోయిన ప్రెగ్నెంట్ ఏనుగుకు ఇలా అంతిమ సంస్కారాలు నిర్వహించారు అని వైరల్ అవుతున్న వార్త 'పచ్చి అబద్ధం'. తరళబాళు జగద్గురు బ్రిహన్నమఠ్ కు చెందిన గౌరీ అనే ఏనుగుకు అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటి ఫోటో. అది కూడా నవంబర్ 2015కు చెందినది.