స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. వైసీపీ నుంచి బూచేప‌ల్లికి బెర్త్ ఖ‌రారు..!

By Newsmeter.Network  Published on  5 Jan 2020 2:45 AM GMT
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు..  వైసీపీ నుంచి బూచేప‌ల్లికి బెర్త్ ఖ‌రారు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. జ‌డ్పీటీసీ, ఎంపీపీ, జ‌డ్పీ చైర్మ‌న్‌ల ప‌ద‌వుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు కావ‌డంతో ఆశా వ‌హులు పోటీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌కాశం జిల్లా జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి ఈ సారి జ‌న‌ర‌ల్ కోటాలో ఉంచారు. దాంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉండే అవ‌కాశం ఉంది. టీడీపీ నుంచి జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఎవ‌రు పోటీప‌డ‌తార‌న్న‌దానిపై ఇంకా క్లారిటీ లేదు. వైసీపీ మాత్రం ప‌క్కా ప్లాన్‌తోనే ముందుకు వెళుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

జిల్లాలోని ప‌లు జ‌డ్పీటీసీల‌ను రిజ‌ర్వు చేసిన అంశం కూడా వైసీపీకి సానుకూలంగా క‌నిపిస్తుంది. వైసీపీ నుంచి జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వికి బూచ‌ప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి పేరు దాదాపు ఖ‌రారైన‌ట్టు చెబుతున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. ద‌ర్శి, సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థుల గెలుపుకోసం గ‌ట్టిగానే కృషి చేశారు.

ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్పుడు ఆయ‌న జ‌డ్పీ చైర్మ‌న్ రేస్‌లోకి వ‌చ్చారు. మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి జ‌డ్పీ చైర్మ‌న్ అభ్యర్థిగా బూచేప‌ల్లిని ప్ర‌తిపాదించిన‌ట్టు చెబుతున్నారు. పోటీకి బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి కూడా సుముఖంగా ఉన్న‌ట్టు స‌మాచారం. జ‌డ్పీటీసీ స్థానాల‌కు రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించ‌గా అవి టీడీపీకి విస్మ‌యాన్ని క‌లిగిస్తున్నాయి.

యాదృచ్ఛికంగా జ‌రిగాయా..? లేక కావాల‌ని చేశారోగానీ టీడీపీని నేల‌మ‌ట్టం చేసేలాగా రిజ‌ర్వేష‌న్లు ఎంపిక చేశార‌ని టీడీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీరాల, అద్దంకి, ప‌ర్చూరు, కొండేపి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని జ‌డ్పీటీసీలు అత్య‌ధికం. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు లేదా ఓసీ మహిళ‌ల‌కు రిజ‌ర్వు చేశారు. దీనివ‌ల్ల టీడీపీ నుంచి బ‌ల‌మైన వ‌ర్గం బ‌రిలో దిగేలా చేశార‌ని టీడీపీ ఆందోళ‌న చెందుతోంది.

అదే స‌మ‌యంలో బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డికి ప‌ట్టున్న ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు జ‌డ్పీటీసీ స్థానాల్లో నాలుగు జ‌న‌ర‌ల్‌గాను, మిగిలిన ఒక‌టి జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయించారు. ఇది ప‌రోక్షంగా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో బూచేప‌ల్లికి క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలోని ఏదో ఒక మండ‌లం నుంచి ఆయ‌న జ‌డ్పీటీసీగా పోటీచేసే అవ‌కాశం ఉంది. వైసీపీ నుంచి బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి జ‌డ్పీచైర్మ‌న్ ఆశిస్తున్నార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో ఇత‌రుల నుంచి పోటీ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

మార్కాపురం అసెంబ్లీ టికెట్‌ను రెండుసార్లు ఆశించిన హ‌నుమారెడ్డి జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌విని ఆశించారు. కానీ, మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలో హ‌నుమారెడ్డి పోటీచేసేందుకు అవ‌కాశం ఉన్న జ‌డ్పీటీసీ స్థానాల‌న్నీ దాదాపు రిజ‌ర్వ్ అయ్యాయి. ఒక మండ‌లం జ‌న‌ర‌ల్‌గా ఉన్నా అక్క‌డ మ‌రో గ‌ట్టి నేత బ‌రిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి జ‌డ్పీ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా దాదాపు ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

Next Story