ఈ వయసులో ఆ ఇద్దరికీ పెళ్ళా...?
By రాణి Published on 25 Dec 2019 3:53 PM IST
ముఖ్యాంశాలు
- కేరళలో ఇద్దరు వృద్ధుల ఆదర్శ వివాహం
- ఏళ్లుగా పరిచయం ఉన్న ఇద్దరు వృద్ధులు
- వృద్ధాశ్రమంలో చాలా ఏళ్ల తర్వాత కలిశారు
- ఒకరితో ఒకరు ఆత్మీయతను పంచుకున్నారు
- చివరి రోజుల్లో తోడు అవసరం కనుక పెళ్లికి సిద్ధపడ్డారు
- వృద్ధాశ్రమం అధికారులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు
- డిసెంబర్ 30వ తేదీన వృద్ధుల ఆదర్శవివాహం
ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా ఆఖరి రోజుల్లో ఒక తోడు అవసరం. జీవితభాగస్వామి లేని లోటు చివరి రోజుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోయిన తర్వాత ఒంటరిగా జీవించాలంటే బతుకు చాలా దుర్భరంగా ఉంటుంది. వయసుడిగిన ఒగ్గులు కనీసం తమకు ఒక తోడు ఉంటే బాగుండని భావిస్తారు. మందోమాకో వేసుకోమని గుర్తు చేయడానికి, సమయానికి పట్టెడన్నం తినమని అడగడానికి, నీకు నేనున్నానంటూ ధైర్యాన్ని అందించడానికి ఆ తోడు చాలా అవసరం. అలాంటి తోడుకోసం ఆరాటపడిన ఇద్దరు వృద్ధులు ఉడిగిన వయసులో సరైన తోడుకోసం, ఆసరాకోసం, ఒకరికి ఒకరు అండగా నిలవడంకోసం వివాహం చేసుకున్నారు.
ఏళ్లుగా పరిచయం ఉన్న ఇద్దరు వృద్ధులు
కేరళలో ముసలి దంపతుల వివాహ వేడుక వార్తను విన్నవాళ్లంతా పెదవి విరవకుండా, పోనీలే ఒకరికొకరు ఇద్దరూ తోడుగా ఉంటారు జీవిత చరమాంకంలో అనుకుని ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నారు. సేవ్ ద డేట్ పేరుతో త్రిశూర్ కార్పొరేషన్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జాన్ డేనియల్ పెట్టిన ఒక ఫేస్ బుక్ పోస్ట్ ఈ మధ్యకాలంలో చాలామందిని విశేషంగా ఆకర్షించింది. వరుడు కొచ్చాడియన్ మీనన్ వయసు 67 సంవత్సరాలు. వధువు పి.వి.లక్ష్మీ అమ్మాళ్ వయసు 66 సంవత్సరాలు. వీళ్లిద్దరూ ప్రభుత్వ వృద్ధుల శరణాలయంలో సహచరులు. త్రిశూర్ జిల్లాలోని రామవరమపురంలో ఉందీ వృద్ధుల శరణాలయం. డిసెంబర్ 30వ తేదీన ఈ వృద్ధులిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. లక్ష్మీ అమ్మాళ్ మొదటి భర్త జి.కె.కృష్ణ అయ్యర్ 22 సంవత్సరాల క్రితం మరణించారు. త్రిశూర్ లో పేరుమోసిన వంటమనిషి ఆయన. ఇరింజలకుడకు చెందిన కొచ్చాడియన్ మీనన్ ఆయన దగ్గర ఎన్నో సంవత్సరాలపాటు సహాయకుడిగా పనిచేశారు. కృష్ణ అయ్యర్ చనిపోయే సమయంలో తన భార్య అయిన లక్ష్మీ అమ్మాళ్ బాగోగుల్ని చూసే బాధ్యతను కృష్ణ మీనన్ చేతిలో పెట్టారు.
చివరి రోజుల్లో తోడు అవసరం కనుక పెళ్లికి సిద్ధపడ్డారు
అయ్యర్ చనిపోయిన తర్వాత మీనన్ చాలా ప్రాంతాల్లో వంటలు చేస్తూ చాలామంది దగ్గర అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒకటిన్నర సంవత్సరాల క్రితం లక్ష్మీ అమ్మాళ్ ఈ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు. ఆరు నెలలక్రితం తనకు పక్షవాతం వచ్చేవరకూ మీనన్ లక్ష్మీ అమ్మాళ్ కు తనకు చేతనైన సాయం చేస్తూనే ఉండేవారు. వయనాడ్ లోని ఒక సామాజిక సేవాసంస్థ మీనన్ కు ఆశ్రయం కల్పించింది. కోజికోడ్ లోని మెడికల్ వైద్య శాలలో ఆయన చికిత్స చేయించుకుని మళ్లీ మామూలు మనిషి అయ్యారు. తను తిరిగి వయనాడ్ కి తిరిగివచ్చిన తర్వాత అక్కడఉన్న కొందరు వృద్ధులద్వారా లక్ష్మీ అమ్మాళ్ గురించి తెలిసింది. మీనన్ కూడా రెండు నెలలక్రితం ఇదే వృద్ధాశ్రమంలో చేరారు. లక్ష్మీ అమ్మాళ్ అప్పట్నుంచీ ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. వృద్ధాశ్రమంలోని ఇతర వృద్ధుల ద్వారా డానియల్ కి లక్ష్మీ అమ్మాళ్, మీనన్ ల కథ తెలిసింది. వెంటనే ఆయన వాళ్లిద్దరితో మాట్లాడి వాళ్లు పెళ్లి చేసుకునేలా ఒప్పించారు.
డిసెంబర్ 30వ తేదీన వృద్ధుల ఆదర్శవివాహం
ఆఖరి రోజుల్లో ఒకరికొకరు తోడుగా ఉండడం అవసరమని, పైగా ఇద్దరూ ఒకరికొకరు తెలిసినవాళ్లే కావడంవల్ల, ఒకరిపై ఒకరు అభిమానాన్ని చూపిస్తూ ఉండడంవల్ల కలసి ఉండడం సబబే అన్న అభిప్రాయాన్ని వాళ్లకు కలిగించారు. సామాజికంగా ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవడానికి పెళ్లి చేసుకోవడం మంచి మార్గమని వాళ్లకు నచ్చజెప్పారు డానియల్. వృద్ధాశ్రమం సూపరింటెండెంట్ చొరవతో వీరి వివాహం డిసెంబర్ 30వ తేదీన జరగబోతోంది. కేరళలో వృద్ధాశ్రమాల్లో సహచరులుగా ఉన్న ఇద్దరు వృద్ధులు వివాహబంధం ద్వారా ఒక్కటి కావడం ఇదే మొదటిసారని ఆయన చెబుతున్నారు. పెళ్లి రోజు దగ్గర పడుతున్నందున వీరి వివాహానికి వృద్ధాశ్రమం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.