ఇంటద్దె రూ. 30 వేలు.. సంపాదన రూ. 2 కోట్లు.. వృత్తి - జేబు దొంగ

By Newsmeter.Network  Published on  25 Dec 2019 7:23 AM GMT
ఇంటద్దె రూ. 30 వేలు.. సంపాదన రూ. 2 కోట్లు.. వృత్తి - జేబు దొంగ

ఠాణేదార్ సింగ్ కుశ్వాహా నెలకు 30000 వేల అద్దె చెల్లించి అందమైన ఫ్లాట్ లో నివసిస్తాడు. తన ఇద్దరు పిల్లలను ఇంటర్నేషనల్ స్కూలుకు పంపిస్తాడు. ఇద్దరికీ ఏడాదికి రెండు లక్షల వరకూ ఫీజులుంటాయి. మంచి లగ్జరీ జీవితం గడుపుతూంటాడు. ఇరుగూ పొరుగూ ఆయనను చూసి అసూయపడతారు. ఆయన ఆదాయం దాదాపు రెండు కోట్ల మేరకు ఉంటుంది. ఇంతకీ ఈ కుశ్వాహా ఎవరు? ఆయన చేసే పనేమిటి? ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలి?

పేరు ఠాణేదార్ – అంటే పోలీసు. కానీ కుశ్వాహా ఒక జేబులు కత్తిరించే దొంగ. మరీ పచ్చిగా చెప్పాలంటే పిక్ పాకెట్. జేబులు కత్తిరించి, పర్సులు దొంగిలించి సంపాదిస్తాడు. ఇప్పటికి దాదాపు 400 సార్లు జేబులు కత్తిరించాడు. ఆ సంపాదించిన డబ్బుతోటే కుటుంబాన్ని విలాసవంతంగా పోషిస్తున్నాడు. డ్యూటీ చేసి చేసి విసుగొస్తే ఆయన క్రికెట్ బెట్టింగ్, జూదం, పందాలు కాయడం వంటివి చేసి రిలాక్స్ అవుతాడట.

ఈ విషయాలన్నీ మంగళవారం రై్ల్వే పోలీసులు అతడిని పట్టుకున్నప్పుడు బయటకి వచ్చాయి. ఈ ఘరానా దొంగ జీవన శైలి చూసిన పోలీసులు కళ్లు తేలేశారు. దూర ప్రయాణాలు చేసే రైళ్లను ఎక్కి, సమయం చూసి సింపుల్ గా కాజేస్తాడు ఈ “కృష్ణుడి వారసుడు.” ఇంతకీ ఆయన ఆయుధమేమిటో తెలుసా... పదునైన, తళతళలాడే గడ్డం గీసుకునే రేజర్ బ్లేడ్. అంతే....

మన కుశ్వాహా 2004 నుంచి ఈ కళలో ఆరితేరాడట. గతంలో ఒక సారి మహారాష్ట్రలో దొరికిపోయి, ఎరవాడ జైలులో ఉన్నాడట. ఆయన జైల్లో ఉన్నప్పుడు ముంబాయి పేలుళ్ల కసాయి కసాబ్ కూడా అదే జైల్లో ఉన్నాడట. అంత గొప్పవాడన్నమాట మన వాడు. ఇంకా నయం ... కసాబ్ తో సెల్ఫీ దిగి ఎఫ్ బీ లో షేర్ చేసుకోలేదు. అరెస్టు అయిన రోజున అతని జేబులో మూడు లక్షల క్యాష్, పదమూడు లక్షల విలువైన నగలు ఉన్నాయట. ఇంతకీ మన ఠాణేదార్ గారు ఉండేది చందానగర్ లోని ఒక ఖరీదైన అపార్టమెంట్ లో.

Next Story
Share it