ఎనిమిది నెలల గర్భిణి 100కి.మీ నడక.. చివరికి..
By Newsmeter.Network Published on 30 March 2020 1:11 PM ISTదేశంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి వేగవంతమవుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ వల్ల లక్షలాది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో చేతిలో డబ్బులేక, ఊరెళ్లేందుకు రవాణా సదుపాయం లేక వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు తిండితిప్పలు లేక పనిచేసే చోటే ఉంటున్నారు. యాజమాన్యాలుసైతం డబ్బులిచ్చే స్థితిలో లేకపోవటంతో మంచినీరు తాగి గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ స్వగ్రామం వెళ్లేందుకు ఎనిమిది నెలల గర్భిణీ తన భర్తతో కలిసి ఆహారం కూడా లేకుండా కాలినడకన 100 కి.మీ ప్రయాణించింది.
Also Read :ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?
యూపీలోని షహ్రాన్‌పూర్‌లోని ఓ కర్మాగారంలో వకీల్ అనే వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా అతను పనులు లేక.. డబ్బులు రాక.. తానుండే నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఊరికి వెళ్లడానికి కూడా డబ్బులు లేక పోవటంతో చేసేదేమీ లేక వకీల్ తన భార్యతో ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. తన భార్య యాస్మిన్ (ఎనిమిది నెలల గర్భిణి)తో కలిసి 200 కి.మీ దూరంలో ఉన్న వారి గ్రామమైన అమర్‌ఘడ్‌కు కాలినడకన బయలుదేరారు. గురువారం బయలుదేరిన వీరు శనివారం నాటికి మీరట్‌లోని షొహ్రాబ్ గేట్ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. వీరి దీనస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో పోలీసులు వారి వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారి వివరాలు అడుగగా.. వకీల్ మాట్లాడుతూ.. తాము రెండు రోజుల క్రితం షహ్రాన్‌పూర్ నుండి బయలుదేరామని.. జాతీయ రహదారి వెంబడి ఉన్న హోటళ్లు అన్నీ మూతపడటంతో రెండు రోజులుగా ఏమీ తినకుండా నడుస్తున్నామని, ఇకొద్ది సమయం అయితే తన భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపాడు.
Also Read :ఏపీలో 23కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
వకీల్ మాటలు విన్న స్థానికులు చలించిపోయారు. ఆ దంపతులకు స్థానికులు కొంత డబ్బుతో పాటు, వారు బులంద్‌షహర్ జిల్లాలోని తమ స్వగ్రామాన్ని చేరడానికి పోలీసులు అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో గర్భిణీ ఎలాంటి ప్రాణాప్రాయం లేకుండా తన స్వగ్రామానికి చేరుకుంది. వకీల్ కుటుంబంలాగే ఎంతో మంది వలస కార్మికులు లాక్‌డౌన్‌తో పనులు లేక.. కడుపు నింపుకొనేందుకు డబ్బులు లేక, యాజమాన్యాలు సహకరించక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
Also Read :టమాటాలు తినండి.. దాన్ని బాగా పెంచుకోండి.!