దరఖాస్తులకు అనూహ్య స్పందన రావడంతో తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET), పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET) రెండు సెషన్లలో కాకుండా మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష వాస్తవానికి జూన్ 3న జరగాల్సి ఉంది.
పత్రికా ప్రకటన ప్రకారం.. 3 సంవత్సరాల TS LAWCET డిగ్రీ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు 09:00 AM నుండి 10:30 AM మరియు 12:30 PM నుండి 2:00 PM వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించబడుతుంది. అలాగే.. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు TS LAWCET, TS PGLCET(LL.M) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు 04:00 PM నుండి 05:30 PM వరకు పరీక్ష జరుగుతుంది.
రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 20గా పేర్కొన్నారు. ఇప్పటికే తమ దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 20 నుండి మే 25 వరకు సవరించుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. దరఖాస్తుదారులు తదుపరి వివరాల కోసం https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.