రాష్ట్రంలో టెట్ షెడ్యూల్ రిలీజ్..ఎప్పటినుంచంటే?
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదల అయింది.
By Knakam Karthik
రాష్ట్రంలో టెట్ షెడ్యూల్ రిలీజ్..ఎప్పటినుంచంటే?
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తాజాగా పరీక్షల నిర్వహణ తేదీలు, సెషన్లు, సబ్జెక్టులు, జిల్లాల వివరాలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించారు.
రాష్ట్రంలో సంవత్సరంలో రెండు సార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత సంవత్సరం జులైలో ప్రకటించింది. ఇందులో భాగంగా గత సంవత్సరం డిసెంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నెలలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన టెట్ పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 2 లక్షల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ఈసారి మాత్రం 1,83,653 దరఖాస్తులే వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పేపర్ 1కు 63,261మంది, పేపర్-2కు 1,20,392మంది దరఖాస్తు చేసుకున్నారు. 2 పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15,000 మంది వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.