హైదరాబాద్: పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 28వ తేదీతో ముగియనున్న గడువు తేదీని మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్ష ద్వారా ఆరో తరగతిలో చేర్చుకుంటారు. ఈ స్కూళ్లలో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తుండటంతో ప్రతి ఏటా ఈ స్కూళ్లలో ప్రవేశాలకు పోటీ అధికంగానే ఉంటుంది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 నుంచి 10 వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. ఇంటర్ వరకు ఉచిత విద్యా బోధన అందుతుండటం, బాలికలకు హాస్టల్ ఫెసిలిటీ ఉండటంతో విద్యార్థులను చేర్పించడానికి పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు.