తెలంగాణలో 'టెట్' నోటిఫికేషన్ విడుదల.. జూన్ 12న పరీక్ష
Teacher Eligibility Test notification released in Telangana.తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు
By తోట వంశీ కుమార్ Published on 24 March 2022 1:26 PM GMTతెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 26 నుంచి జూన్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే విద్యాశాఖ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆధ్రువపత్రానికి ఇప్పటి వరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తరువాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటి నుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది.
టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 90మార్కులు(60శాతం), బీసీలకు 75 మార్కులు(50 శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు(40శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.