పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్ బోర్డు
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని టీఎస్ బీఐఈ నిర్ణయించింది.
By అంజి Published on 2 March 2024 11:42 AM ISTపరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్ బోర్డు
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) నిర్ణయించింది. ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు పరీక్ష రాయడానికి అనుమతించలేదని ఆదిలాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో బోర్డు నిబంధనలు సవరించింది. విద్యార్థి సంఘం, తల్లిదండ్రుల నుండి బోర్డ్‌పై విమర్శలు రావడంతో, అనివార్య పరిస్థితుల కారణంగా ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 28న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు 11వ, 12వ తరగతులకు చెందిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. నిమిషం ఆలస్యమైనా వచ్చే వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదన్న నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకపోవడంతో విద్యార్థులు మండిపడుతున్నారు.
పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఆధారపడిన విద్యార్థులు నిబంధనతో తీవ్రంగా నష్టపోయారు. టిఎస్‌ఆర్‌టిసి బస్సులు అందుబాటులో లేకపోవడం, ట్రాఫిక్ జామ్‌లు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల చేరుకోలేని విద్యార్థులకు వెసులుబాటు ఇవ్వకపోవడంపై బోర్డు విమర్శలకు గురైంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న టి.శివకుమార్ (18) ఫిబ్రవరి 29న ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విద్యార్థి పరీక్షా కేంద్రానికి రాలేదని అధికారులు తెలిపారు. పరీక్షల ఒత్తిడి కారణంగా అతడు ఈ విపరీతమైన చర్య తీసుకున్నట్లు వారు అనుమానిస్తున్నారు. మార్చి 19 వరకు పరీక్షలు కొనసాగనుండగా .. మార్చి 4 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నట్లు బోర్డు ప్రకటించింది.మార్చి 24న మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుంది.