'సర్టిఫికెట్లు విద్యార్థి ఆస్తి'.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
విద్యార్థుల టీసీల విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సర్టిఫికెట్ అనేది విద్యార్థి ఆస్తి అని పేర్కొంది.
By అంజి Published on 25 Jun 2024 11:04 AM IST'సర్టిఫికెట్లు విద్యార్థి ఆస్తి'.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
విద్యార్థుల టీసీల విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సర్టిఫికెట్ అనేది విద్యార్థి ఆస్తి అని పేర్కొంది. దానిపై పాఠశాలలు తాత్కాలిక హక్కులు పొందలేవని హైకోర్టు పేర్కొంది. ఫీజు బకాయిల కారణంగా సర్టిఫికెట్లను నిలిపివేయడం సరికాదని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం.. విద్య ప్రాథమిక హక్కు అని స్కూళ్లకు సపోర్ట్ చేస్తూ అధికారులు అనుచితంగా వ్యవహరించరాదన్నారు.
ఏదైనా కారణం వల్ల ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు వెళ్లే హక్కు విద్యార్థికి ఉందని, దాన్ని ఆయా స్కూల్ యాజమాన్యాలు అడ్డుకోకూడదని స్పష్టం చేసింది. ఫీజు బకాయిలు ఉన్నట్లయితే వాటిని తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకోవడానికి సంబంధిత కోర్టులను వెళ్లవచ్చని తెలిపింది. సర్టిఫికెట్లను ఉంచుకుని ఫీజు చెల్లించాలన్న ప్రయత్నాలు కరెక్ట్ కాదని పేర్కొంది. విద్యార్థుల సర్టిఫికెట్లను ఇచ్చి తీరాల్సిందేనని.. ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీ సిద్ధార్థ హైస్కూల్ తమ పిల్లల టీసీలను జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కరీంనగర్‌కు చెందిన వి.దినేష్‌తో పాటు మరో 42మంది హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టి తాజా తీర్పును ఇచ్చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫీజులు చెల్లించినా అక్రమంగా మరింత డిమాండ్ చేస్తూ టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్)లను జారీ చేయడం లేదన్నారు.
పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు మరో పాఠశాల పిల్లలకు అడ్మిషన్ ఇచ్చిందని, అయితే టీసీలు సమర్పించాలని షరతు విధించిందని చెప్పారు. అటు శ్రీ సిద్దార్ల పాఠశాల తరఫు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. ఓ వ్యక్తి విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవపట్టించి వారిని మరో పాఠశాలలో చేర్పించారని చెప్పారు. వారి నుంచి 2019 నుంచి 2022 దాకా ఫీజు బకాయిలు రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు.