తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్దృతి కొనసాగుతుండంతో సంక్రాంతి సెలవులను ముందుగా ఇచ్చారు. సంక్రాంతి సెలవులను జనవరి 8 నుంచి 16వ తేదీ వరకు ప్రకటించారు. ఆ సమయంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సెలవులను మరోసారి పొడిగించారు. జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వైపు విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.