రేపే నీట్ పరీక్ష.. విద్యార్థులూ ఇవి గుర్తు పెట్టుకోండి..!

NEET UG 2021 Tomorrow. సెప్టెంబర్ 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ( National Eligibility cum Entrance Test ) ఎగ్జామ్‌ను

By Medi Samrat  Published on  11 Sep 2021 11:35 AM GMT
రేపే నీట్ పరీక్ష.. విద్యార్థులూ ఇవి గుర్తు పెట్టుకోండి..!

సెప్టెంబర్ 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ( National Eligibility cum Entrance Test ) ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 ల‌క్ష‌ల మంది ఈ ఎగ్జామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇక తెలంగాణ‌, ఏపీ నుంచి ల‌క్ష మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా 202 ప‌ట్ట‌ణాల్లో 3,842 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ‌లోని 7 ప‌ట్ట‌ణాల్లో 112 కేంద్రాల్లో, ఏపీలో 9 ప‌ట్ట‌ణాల్లో 151 కేంద్రాల్లో ప‌రీక్ష‌కు ఏర్పాట్లు చేశారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నీట్ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల త‌ర్వాత నిమిషం ఆల‌స్య‌మైనా అనుమ‌తించ‌రని అధికారులు తెలిపారు. పెన్ను, పేప‌ర్ విధానంలోనే ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. పరీక్షా కేంద్రంలోని అడ్మిట్ కార్డు, ఫోటో, గుర్తింపు కార్డుతో పాటు చిన్న శానిటైజ‌ర్ బాటిల్‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తామని అధికారులు అన్నారు. ప్ర‌తి విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాలి. షూ, ఫుల్ హ్యాండ్ ష‌ర్ట్స్, పెన్నులు, ఆభ‌ర‌ణాలు, వాట‌ర్ బాటిల్స్‌కు అనుమ‌తి లేద‌ని అధికారులు తెలిపారు. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలని తెలిపారు. కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేయనున్నారు.

నీట్‌ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలని తెలిపారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దని తెలిపారు. మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే అలాంటి విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలి. అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరని తెలిపారు. స్లిప్పర్లు, తక్కువ హీల్‌ ఉండే సాండిల్స్‌ మాత్రమే వేసుకుని రావాలని తెలిపారు. వ్యాలెట్‌, పౌచ్‌, గాగుల్స్‌, టోపీలు, హ్యాండ్‌బ్యాగులు వంటివి తీసుకురాకూడదని సూచించారు. పెన్సిల్‌బాక్సు, కాలిక్యులేటర్‌, పెన్ను, స్కేల్‌, రైటింగ్‌ ప్యాడ్‌, వంటికి కూడా అనుమతించరు.

మొబైల్‌ ఫోన్‌, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌, హెల్త్‌బ్యాండ్‌, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు కూడా వెంట తీసుకురావొద్దని తెలిపారు. అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్‌, బ్రాస్‌లెట్‌ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్‌లెట్లు వేసుకోవద్దని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్‌ బాటిళ్లు కూడా తీసుకురావొద్దు. అవేవీ పరీక్ష హాలులోకి అనుమతించబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు.


Next Story