మరిన్ని ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్‌

JEE Mains Exam In Regional Languages. ఇంజనీరింగ్‌ కళాశాల్లో ప్రవేశం కొరకు జరిపే ప‌రీక్ష జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేష

By Medi Samrat  Published on  24 Nov 2020 1:09 PM IST
మరిన్ని ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్‌
ఇంజనీరింగ్‌ కళాశాల్లో ప్రవేశం కొరకు జరిపే ప‌రీక్ష జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ మెయిన్‌ (జేఈఈ మెయిన్‌). ఈ ప‌రీక్ష‌ల్లో తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు ప‌డే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంగ్లీష్‌లో ఉండే ఫార్ములాలు అర్థంకాక‌.. ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల‌తో పోటీప‌డ‌లేక విద్యార్థులు జాతీయ స్థాయి విద్యాసంస్థ‌ల్లో సీట్ల‌ను పొంద‌లేక‌పోతున్నారు. కొంద‌రు ఏదో ప‌రీక్ష రాసాం అని మ‌మా అనిపిస్తుంటే.. ఇంకొద‌రు ప‌రీక్ష‌నే రాయ‌డం లేదు. ఇక‌పై ఈ ప‌రిస్థితి మార‌నుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న భాషా సమస్యలకు చెక్‌పెడుతూ ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు 2021 నుంచి జేఈఈ మెయిన్‌ను తమ భాషల్లోనే రాసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు లక్షన్నర మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.


ఎంహెచ్‌ఆర్‌డీ (కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ) ఆదేశాలతో.. జేఈఈ మెయిన్‌ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 9 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కసరత్తు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు ఇంగ్లిష్‌/హిందీ లేదా గుజరాతీలో పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల భాషా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఎంహెచ్‌ఆర్‌డీ గుర్తించింది. ఈ నేపథ్యంలో హిందీ, ఇంగ్లిష్‌ సహా 9 ప్రాంతీయ భాషలతో కలిపి మొత్తం 11 భాషల్లో జేఈఈ మెయిన్‌ నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఇకపై ఏటా ఇంగ్లిష్, హిందీ, గుజరాతీతోపాటు అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్‌ నిర్వహించనున్నారు. ఇంకా ఏవైనా రాష్ట్రాలు కోరితే ఆయా భాషల్లోకి ప్రశ్నపత్రాలను అనువాదం చేసే అంశాన్నీ కూడా ఎన్‌టీఏ పరిశీలిస్తోంది.

జేఈఈ మెయిన్‌ను ఎన్‌టీఏ ప్ర‌తి సంవ‌త్స‌రం రెండుసార్లు నిర్వహిస్తోంది. వచ్చే జనవరి, ఏప్రిల్‌లోనూ ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇంటర్మీడియట్‌లో ప్రత్యక్ష విద్యాబోధన కాకుండా ఆన్‌లైన్‌ బోధనే కొనసాగుతోంది. దీంతో 2021లో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఎన్‌టీఏ ఉంది. దీనిపై అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియట్‌ బోర్డులతోనూ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే జనవరిలో పరీక్ష నిర్వహణ సాధ్యం కాదన్న భావనకు ఇప్పటికే వచ్చింది. అయితే ఫిబ్రవరిలో నిర్వహించాలా? వద్దా? అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించకపోతే ఏప్రిల్‌కు బదులు మేలో జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది.




Next Story