నిరీక్ష‌ణ‌కు తెర‌.. జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదల

JEE main 2021 session 4 results Released.లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. మంగళవారం అర్ధరాత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sept 2021 8:13 AM IST
నిరీక్ష‌ణ‌కు తెర‌.. జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదల

లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నాలుగో విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుద‌ల చేసింది. 44 మంది విద్యార్థులు 100 ప‌ర్సంటైల్ సాధించగా.. వీరిలో 18 మంది విద్యార్థులు మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఈ ఫ‌లితాల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు స‌త్తా చాటారు. ఏపీ నుంచి న‌లుగురు, తెలంగాణ నుంచి ఇద్ద‌రు.. మొద‌టి ర్యాంకును సాధించారు. ఏపీ నుంచి దుగ్గినేని వెంకట పనీష్‌, పసల వీరశివ, కాంచనపల్లి రాహుల్‌ నాయుడు, కరణం లోకేష్‌ మొదటి ర్యాంకు సాధించగా.. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకట ఆదిత్య మొదటి ర్యాంకులో నిలిచారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.inలో చూసుకోవచ్చు.

జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు​ 26, 27, 31, సెప్టెంబర్​ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతి, అస్సామీస్‌, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళం) నిర్వహించారు.సెప్టెంబ‌ర్ 6న ప‌రీక్ష ప‌త్రం కీ పేప‌ర్‌ను విడుద‌ల చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేష‌న్ సెప్టెంబ‌ర్ 11న ప్రారంభం కావాల్సిఉండ‌గా.. ఫ‌లితాల విడుద‌ల‌లో ఆల‌స్యం కార‌ణంగా సెప్టెంబ‌ర్ 13కు వాయిదా వేశారు.

Next Story