విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం.. పాఠ‌శాల‌ల్లో ప్రార్థ‌న‌లు ర‌ద్దు..!

In Andhra pradesh no morning prayers in schools.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2022 4:32 AM GMT
విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం.. పాఠ‌శాల‌ల్లో ప్రార్థ‌న‌లు ర‌ద్దు..!

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. దీంతో ప‌లు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ రోజువారి కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ఉద‌యం పూటి పాఠ‌శాల‌ల్లో నిర్వ‌హించే ప్రార్థ‌న‌ల‌ను నిలిపివేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. పాఠ‌శాల్లో క్రీడ‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని సూచించింది. ఈ మేర‌కు క‌రోనా నియంత్ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.

విద్యార్థులంతా ఒకే చోటు గుమిగూడ‌కుండా ఉపాధ్యాయులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. ఇక పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌ల‌ను, గ‌దుల‌ను(క్లాస్‌ల‌ను) ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేయాల‌ని, క‌రోనా నియంత్ర‌ణ‌కు జిల్లా విద్యాధికారులు సంబంధిత డీఎంహెచ్‌వోల‌ను క‌లిసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపింది. ఇక విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ క‌రోనా బారిన ప‌డితే.. వెంట‌నే చికిత్స అందేలా చూడాల‌ని చెప్పింది. మాస్కులు ధ‌రిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాల‌ని తెలిపింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌క‌పాటించాల‌ని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,266 పరీక్షలు నిర్వహించగా.. 14,502 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,95,136కి చేరింది. కొవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం మరియు విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,549గా ఉంది. 24 గంటల వ్యవధిలో 4,800 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,87,282కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 93,305 యాక్టివ్‌ కేసులున్నాయి.

Next Story