హెచ్‌పీఎస్‌లో స్టూడెంట్ లీడర్లకు సత్కారం.. విద్యార్థులకు ఎయిర్ చీఫ్ మార్షల్ అభినందనలు

Hyderabad Public School honours future leaders Air Chief Marshal congratulates students. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో స్టూడెంట్ లీడర్లను గుర్తించి సత్కరించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2023 6:17 PM IST
హెచ్‌పీఎస్‌లో స్టూడెంట్ లీడర్లకు సత్కారం.. విద్యార్థులకు ఎయిర్ చీఫ్ మార్షల్ అభినందనలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో స్టూడెంట్ లీడర్లను గుర్తించి సత్కరించారు. ప్రతి ఏడాది జూలై 21న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుక చాలా ముఖ్యమైనది.. విద్యార్థుల్లో నాయకత్వాన్ని పెంపొందించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌదరి PVSM AVSM VM ADC, ఆయన జీవిత భాగస్వామి నీతా చౌదరి హాజరయ్యారు. HPS బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ R రఘురామ్ రెడ్డి, HPS సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు, HPS పూర్వ విద్యార్థి లార్డ్ కరణ్ బిలిమోరియా కూడా హాజరయ్యారు


విద్యార్థులకు కౌన్సిల్ హెడ్, హౌస్ కెప్టెన్‌లు, ప్రిఫెక్ట్‌లు వంటి పొజిషన్స్ ను ఈ కార్యక్రమంలో ఇచ్చారు. విద్యార్థులను భవిష్యత్తులో గొప్ప నాయకులుగా తీర్చిదిద్దడానికి పాఠశాల స్థాయి నుండే ఇలాంటివి దక్కుతూ ఉండడం చాలా గొప్ప విషయం. స్కూల్ కమ్యూనిటీకి కూడా నిర్మాణాత్మక సహకారం అందించడానికి వీలవుతుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌదరి విద్యార్థులను కలుసుకుని ముచ్చటించారు. 152 మందితో ఉన్న ఎన్‌సిసి క్యాడెట్‌ల దళాలను పరిశీలించారు. విద్యార్థులు చేసిన విన్యాసాలకు ఆయన కూడా ఫిదా అయ్యారు. పలువురిని మెచ్చుకున్నారు.


హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన వేడుక కేవలం బిరుదులను, అవార్డులను ఇవ్వడానికి మాత్రమే కాదు. సమాజానికి నాయకులను అందించడానికి చేసిన ప్రయత్నం. భవిష్యత్తుకు నాయకులను అందించడానికి, నేటి తరాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి ఇది ఒక అవకాశం. హెడ్ ​​బాయ్, హెడ్ గర్ల్ వారి అనుభవాల గురించి ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల విజయాలు, సామర్థ్యాలు, కృషి, పాఠశాల పట్ల అభిమానాన్ని గుర్తించడానికి నిర్వహించారు. విజయవంతంగా ముందుకు వెళ్లడానికి కావాల్సిన మద్దతును కూడా అందించారు.


లార్డ్ బిలిమోరియా విద్యార్థులకు శుభాకాంక్షలను తెలియజేసారు, “ఈ గొప్ప సంస్థలో చదువుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నిజమైన నాయకత్వం అంటే ఇతరులను శక్తివంతం చేయడం, సమిష్టిగా సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రేరేపించడం, సానుకూల మార్పు కోసం ప్రయత్నించడం అని నేను ఈ స్కూల్ లోనే తెలుసుకున్నాను. నిజాయితీ, సానుభూతి, వ్యక్తిగత లక్ష్యాలకు మించిన దృష్టితో నడిపించడం మన బాధ్యత. ఈ అద్భుతమైన సంస్థలో నేర్చుకున్న వాటితో మీరు ఎక్కడికి వెళ్లినా ప్రకాశించగలరు.. గెలవగలరు.. నవ సమాజాన్ని నిర్మించగలరు." అని అన్నారు.


ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌదరి మాట్లాడుతూ "ఈ ప్రపంచానికి నాయకుల అవసరం ఉంది. ఆ నాయకుల్లో కరుణ, నైతికత, దూరదృష్టి కూడా ఉండాలి. నాయకత్వం అనేది నిరంతర అభ్యాసం ద్వారా అబ్బుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడం, మీ నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవడం ఎప్పుడూ ఆపవద్దు." అని అన్నారు.

“మా ఇన్వెస్టిచర్ వేడుక అనేది మా విద్యార్థుల నాయకత్వం, క్యారెక్టర్, అపరిమితమైన సామర్థ్యానికి సంబంధించిన వేడుక. ఈ ఈవెంట్ విద్యార్థులలో స్ఫూర్తినిస్తుంది. ఈ వేడుకకు ఎయిర్ చీఫ్ మార్షల్, లార్డ్ కరణ్ బిలిమోరియాలు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు మరింతగా ఎదగాలని కోరుకుంటున్నాను” అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ స్కంద్ బాలి అన్నారు.

విలువలను పెంపొందించడానికి, నాయకత్వ లక్షణాలను విద్యార్థులు అలవర్చుకోడానికి అంకితభావంతో ముందుకు వెళతామని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పునరుద్ఘాటించింది. భవిష్యత్ నాయకులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఇన్వెస్టిచర్ ఈవెంట్ లీడర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది యాజమాన్యం. ఇక విద్యార్థులు గుర్రాలతో మార్చ్ పాస్ట్‌తో వేడుకను ముగించారు. వాతావరణం సరిగా లేని కారణంగా ఇంకొన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.


Next Story