పదో తరగతి పరీక్షల కేంద్రాలున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 23 వరకు ఆరు రోజులు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వీటికి బదులుగా ఈ నెల 24, 31, ఏప్రిల్ 7,13,14,21 తేదీల్లో తరగతులు నిర్వహించాలని స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించింది. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. కాగా.. మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లు ఏర్పాటు చేశారు.
ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అరగంట వరకు అంటే ఉదయం 10 గంటల వరకూ పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఇప్పటికే హాల్ టిక్కెట్ పొందిన వారు తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో తదితర వివరాలను నిశితంగా పరిశీలించాలని, ఏదైనా వ్యత్యాసం ఉంటే ప్రధానోపాధ్యాయుడిని లేదా ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలి. ప్రశ్నపత్రాలు బయటకు పంపే వీలులేకుండా అధికారులు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఏవైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్ 9000945346ను సంప్రదించొచ్చు.