ఏఐ ఆధారిత చాట్‌జీపీటీని వాడితే కఠిన చర్యలు చేపడతామని విద్యార్ధులను సీబీఎస్ఈ హెచ్చరించింది. ప్రస్తుతం జరుగుతున్న పది, పన్నెండో తరగతి పరీక్షల్లో చాట్‌జీపీటీని వాడకూడదని కోరింది. ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ గణాంక సమస్యలను ఇట్టే పరిష్కరిస్తోంది. పది, పన్నెండో తరగతి విద్యార్ధులకు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని బోర్డు నిషేధించింది. తాజాగా పరీక్షా కేంద్రాల్లో చాట్‌జీపీటీ వాడకాన్ని నిషేధించింది. సీబీఎస్ఈ నిర్వహిస్తున్న పది, పన్నెండో తరగతి పరీక్షల్లో కృత్రిమ మేథ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీని నిషేధించామని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. పరీక్షల్లో పాస్ అయ్యేందుకు అక్రమ మార్గాలను అనుసరించడంపై విద్యార్ధులను సీబీఎస్ఈ హెచ్చరించింది. ఎగ్జామ్స్ అడ్మిషన్ కార్డులో సైతం పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడితే బోర్డు నిబంధనలు అనుసరించి చర్యలు చేపడతామని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.