ఏపీ ఈఏపీ సెట్-2023 ఫలితాలు విడుద‌ల‌.. అమ్మాయిలదే పైచేయి

AP EAPCET result 2023 EAMCET results declared. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌–2023

By Medi Samrat  Published on  14 Jun 2023 3:40 PM IST
ఏపీ ఈఏపీ సెట్-2023 ఫలితాలు విడుద‌ల‌.. అమ్మాయిలదే పైచేయి

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌–2023 ఫలితాల్లో అత్యధిక శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం విజయవాడ బందర్ రోడ్డులోని లెమట్ ట్రీ ప్రీమియర్ హోటల్ లో ఏపీ ఈఏపీ సెట్ -2023 ఫలితాల విడుదల అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అనంతపురం జేఎన్‌టీయూ - ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్-2023 పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మంది (3,14,797) విద్యార్థులు హాజరయ్యారన్నారు. విద్యార్థులు ఇంటర్‌ లో సాధించిన మార్కుల ప్రకారం.. వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీ సెట్‌ -2023 ర్యాంకులను ప్రకటించామన్నారు.

ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో అబ్బాయిల కంటే అత్యధికంగా అమ్మాయిలు ఉత్తీర్ణత (3.99 శాతం) సాధించగా, ఇంజినీరింగ్ విభాగంలో తొలి పది స్థానాల్లో బాలురు, అగ్రికల్చర్ విభాగంలో తొలి 10 స్థానాల్లో 8 మంది బాలురు, ఇద్దరు బాలికలు నిలిచారని పేర్కొన్నారు.

ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది పరీక్షలకు హాజరు కాగా.. అందులో 1,71,514 మంది (76.32 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. అగ్రికల్చర్ విభాగంలో 90,573 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 81,203 మంది (89.65 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ప్రవేశాలకు అర్హత పొందారని వెల్లడించారు

ఇంజినీరింగ్ విభాగంలో చల్లా ఉమేష్ వరుణ్ 160 మార్కులకు గానూ 158 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, బిక్కిన అభినవ్ చౌదరి (157/160) రెండో స్థానంలో, నందిపాటి సాయి దుర్గారెడ్డి (155/160) మూడో స్థానంలో, చింతపర్తి బాబు సుజన్ రెడ్డి(155/160) నాలుగో స్థానంలో, దుగ్గినేని వెంకట యుగేష్ (154/160) ఐదో స్థానం, అడ్డగడ వెంకట శివరామ్ (153/160) ఆరో స్థానం, యక్కంటి ఫణి వెంకట మణీందర్ రెడ్డి (154/160) ఏడో స్థానం, మేడాపురం లక్ష్మీనర్సింహ మాధవ్ భరద్వాజ్ (153/160) ఎనిమిదో స్థానం, పిన్ను శశాంక్ రెడ్డి తొమ్మిదో స్థానం(152/160), ఎం. శ్రీకాంత్ (152/160) మార్కులతో పదో స్థానం సాధించారని వివరించారు.

అగ్రి కల్చర్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ 160 కి గానూ 153 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, బోరా వరుణ్ చక్రవర్తి (151/160) రెండో ర్యాంకు, కొన్ని రాజ్ కుమార్ (151/160) మూడో ర్యాంకు, వలేటి సాయి అభినవ్ (149/160) నాలుగో ర్యాంకు, దుర్గెంపూడి కార్తికేయరెడ్డి(150/160) ఐదో ర్యాంకు, రాజేశ్వరి కుచూరు (149/160) ఆరో ర్యాంకు, తడ్డి సాయి వెంకట యశ్వంత్ నాయుడు(148/160) ఏడో ర్యాంకు, గుడిపూడి కీర్తి (147/160) ఎనిమిదో ర్యాంకు, పొట్నూరు ఆశిష్ (148/160) తొమ్మిదో ర్యాంకు, దేరాంగుల అభిజిత్ సాయి (147/160) పదో ర్యాంకు సాధించినట్లు వివరించారు.

ఏపీ ఈఏపీసెట్-2023 కు ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2,07,787 మంది అభ్యర్థులు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 1,10,887, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 16,056, నాన్ లోకల్ విభాగంలో 4009 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఓసీలు 1,05,556, బీసీ-ఏ 46,864, బీసీ- బీ2,221, బీసీ-సీ 61,126, బీసీ-డీ 17,235, బీసీ-ఈ 53,521 , ఎస్సీ, ఎస్టీలు కలిపి 11,383 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు గణాంకాలను మంత్రి వివరించారు.

2023 మే 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 2,38,180 మంది ఇంజినీరింగ్ విభాగంలో 1,00,559 మంది అభ్యర్థులు అగ్రికల్చర్ విభాగంలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. 1,69,302 మంది అమ్మాయిల్లో ఇంజినీరింగ్ విభాగంలో 97,659 మంది, అగ్రికల్చర్ విభాగంలో 71.643 మంది ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా 1,69,437 మంది అబ్బాయిల్లో ఇంజినీరింగ్ విభాగంలో 1,40,521, అగ్రికల్చర్ విభాగంలో 28,916 మంది ఉన్నారన్నారు.

10 మార్చి, 2023న ఏపీ ఈఏపీసెట్-2023కు నోటిఫికేషన్ విడుదల చేశామని, మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగాలకు తెలుగు రాష్ట్రాల్లో 25 జోన్లుగా విభజించి 136 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 15 జులై, 2023 నుండి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని అందువల్లే సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.


Next Story