ఏపీ 10వ తరగతి పరీక్షలు వాయిదా.!
AP 10th class exams be postponed. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వాయిదా పడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే మే 2 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది.
By అంజి Published on 13 March 2022 3:16 AM GMTఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వాయిదా పడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే మే 2 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వారం రోజుల పాటు 10వ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. మే 9వ తేదీ నుండి లేదా మే 13వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం పరిశీలిస్తోంది. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు కొన్ని ఒకే తేదీల్లో జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జేఈఈ పరీక్షల షెడ్యూల్ వల్ల ఇప్పటికే ఇంటర్ పరీక్షల తేదీని వాయిదా వేయాల్సి వచ్చింది. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 16 నుండి 21 వరకు జరగనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. దీంతో ఏప్రిల్ 8 నుండి 28 వరకు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు.
ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. కాగా 10వ తరగతి పరీక్షలు మే 2 నుండి 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. దీంతో కొన్ని చోట్ల ఇంటర్, 10వ తరగతి పరీక్షలు ఒకే సెంటర్ నిర్వహించాల్సి ఉంది. పరీక్ష కేంద్రాలను వేరే చోటు మార్చేందుకు వీలుపడదు. మరో వైపు ఇంటర్, 10వ తరగతి పరీక్షలు ఒకేసారి జరిగితే ప్రశ్నపత్రాలు, బుక్‌లెట్లు, పరీక్ష సామాగ్రి భద్రపరిచేందుకు పోలీస్‌స్టేషన్లలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోలీసు భద్రతకు, వైద్య ఆరోగ్య సిబ్బంది విషయంలో సమస్యలు వస్తాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.