ఆ పత్రికనే మంత్రి ఎందుకు టార్గెట్ చేశారు..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Nov 2019 5:35 PM ISTముఖ్యాంశాలు
- వైసీపీ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: ఆదిమూలపు సురేష్
- ఇంగ్లీష్ మీడియంపై ఓ దినపత్రిక విషం చిమ్ముతోంది: ఆదిమూలపు
- సీఎం నిర్ణయంపై విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు: ఆదిమూలపు
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియంపై ఓ దినపత్రిక విషం చిమ్ముతోందన్నారు. ఇంగ్లీష్ మాద్యమాన్ని మతానికి ముడిపెట్టి విశ్లేషణ చేయడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇంగ్లీష్ మాద్యమం అందించి మత మార్పిడి చేయాలని చూస్తున్నారని ఓ ప్రతికలో వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన రాతలు ఎక్కడైనా ఉంటాయా? అంటూ ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. ఈ విషయంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం నుంచి ఏటా రెండు లక్షల మంది విద్యార్థులుల విదేశాలకు వెళ్తున్నారు. వీరంతా ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం పొందినవారే.. వారిని కూడా మతం కోణంలో చూస్తారా? అంటూ మండిపడ్డారు.
ప్రపంచమే ఓ కుగ్రామంగా మారుతోంది. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను అందుకొని మంచి అవకాశాలను దక్కించుకోవాలన్నారు. చైనా, జపాన్ దేశాలకు చెందిన వారు కూడా ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికా, యూరప్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే సీఎం వైఎస్ జగన్ ఇంగ్లీష్ మాద్యమంపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామని తెలిపారు. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఎందుకు అవసరమో ఇప్పటికే సీఎం జగన్ సృష్టంగా వివరించారని చెప్పుకొచ్చారు. విద్యార్థులు రాబోయే రోజుల్లో వారి నైపుణ్యాలను పెంచుకోవాలని సీఎం జగన్ చెప్పారు. సీఎం జగన్ నిర్ణయంపై విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఎస్టీలకు 39 శాతం, ఎస్సీలకు 49 శాతం, మైనార్టీలకు 62 శాతం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. మన విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరువేలకుపై చిలుకు ఇంగ్లీష్ మాద్యమం స్కూళ్లు నడుస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సుమారు 62 శాతం మంది ఇంగ్లీష్ మాద్యమంలో చదువుతున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ శాతం తగ్గిందన్నారు.
చైతన్య, నారాయణ, బాష్యం, తదితర కాలేజీల్లో ఆంగ్ల మాద్యమం చూపి ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అధిక ఫీజులు చెల్లించగలిగే వారికే ఇంగ్టీష్ మీడియం పరిమితం కాకూడదని.. అందకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ బాషకు అనుగుణంగా వారిలో నైపుణ్యాలు పెంచాల్సి ఉందన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలన్నారు. మనబడి నాడు- నేడు కార్యక్రమాన్ని కూడా వీటికోసం అమలు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.