భూమి గుండ్రంగా లేదు.. చాపలాగానే ఉంది

By రాణి  Published on  29 Feb 2020 2:31 PM IST
భూమి గుండ్రంగా లేదు.. చాపలాగానే ఉంది

“నాకు తెలిసినవి రెండే. ఒకటి - ఏదో ఒక రోజు చచ్చిపోవడం ఖాయం. రెండోది - భూమి గుండ్రంగా కాదు. బల్లపరుపుగా ఉంది.” బ్రెజిల్ రాజధాని సావో పాలో లోని ఒక రెస్టారెంట్ యజమాని రికార్డో అందరికీ ఇదే మాట చెబుతుంటాడు. భూమి బల్లపరుపుగా, చాప లాగా ఉందని ఆయన ధృడ నమ్మకం. కానీ ఆయనొక్కడే కాదు. బ్రెజిల్ జనాభా లోని ఏడు శాతం మంది ప్రజలు దీన్నే నమ్ముతారు. రికార్డో హోటల్ నిజానికి భూమి చాపలా ఉందని నమ్మే వాళ్లకి ఒక పెద్ద మీటింగ్ ప్లేస్.

బ్రెజిల్ లోని ఒపీనియన్ పోల్స్ నిర్వహించే సంస్థ డేటా ఫోల్హో కథనం ప్రకారం బ్రెజిల్ లో దాదాపు 1.1 కోటి మంది భూమి బల్లపరుపుగా ఉందని గట్టిగా నమ్ముతున్నారు. బ్రెజిల్ లో ప్రస్తుతం మేథో వ్యతిరేకత, దేశాధ్యక్షుడు జైర్ బోల్సెనారో వింత నమ్మకాలదే పైచేయిగా ఉంది. ఆయన సలహాదార్లలో ఒకరైన రచయిత, మాజీ జ్యోతిష్కుడు ఒలావో డీ కర్వాల్హో అయితే భూమి గుండ్రంగా ఉందని ఎవరైనా అంటే చాలు. వారితో వాగ్వాదానికి దిగేస్తాడు. భూమి చాపలా ఉందన్న నమ్మకం అంత దృఢంగా ఉందాయనకు.

అయితే భూమి చాపగా ఉందని నమ్మేవారు చాలా హాస్యంగా, ఇతరులతో సంబంధం లేకుండా, వాట్సప్ లో రహస్య మెసేజీలు పంపుకుంటూ కలుసుకుంటుంటారు. వారి ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానెళ్లకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉంటారు. పైగా ఖగోళ శాస్త్రం, గణితం, ఫిజిక్స్ ల సాయంతో వారు భూమి బల్లపరుపుగా ఉండటమే కాదు, భూమి తన చుట్టూ తాను తిరగదని, అసలు సూర్యుడి చుట్టూ తిరిగే ప్రసక్తే లేదని వాదిస్తూంటారు. భూమి గుండ్రంగా ఉందన్న వాదనలన్నిటినీ కుట్రలుగా ప్రకటించి తిరస్కరించేస్తారు.

తమాషా ఏమిటంటే భూమి చాపలా ఉందని నమ్మేవారంతా మగవారే. అందరూ క్యాథలిక్కులే. అందరూ మతమార్పిడులు చేసే క్రైస్తవులే. వారు న్యూటన్, కోపర్నికస్ ల సిద్ధాంతాలన్నీ కుట్రలుగానే భావిస్తారు. భూమి ఊగుండ్రంగా ఉందనడం ప్రపంచంలోని సంపన్నులు పేదలపై చేసిన అతిపెద్ద కుట్ర అని వారి అభిప్రాయం. అసలు భూమి ఒక కంప్యూటర్ సీడీలా బల్లపరుపుగా ఉంటుందని వారు నమ్ముతున్నారు.

Next Story