మామూలుగానే వేపకాయంత వెర్రి ప్రతివాడికీ ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక వెర్రి గుమ్మడికాయంత అయిపోయింది. రోజుకో ప్రాణాంతక గేమ్, గడియకో వీర విచిత్ర ఛాలెంజ్ లతో ఇంటర్ నెట్ యూత్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఇప్పుడు తాజాగా స్కల్ బ్రేకర్ చాలెంజ్ ఇంటర్ నెట్ లో వీర విహారం చేస్తోంది. స్కల్ బ్రేకర్ చాలెంజ్ అంటే తలను బద్దలు గొట్టే చాలెంజ్ అన్న మాట.

ఈ టిక్ టోక్ చాలెంజ్ లో ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే సారి గెంతుతారు. అందులో మధ్యలో ఉన్న వ్యక్తి గెంతగానే అటూ ఇటూ ఇన్న ఇద్దరూ అతని కాళ్లను తన్నేస్తారు. దాంతో మధ్యలో కుర్రాడు ఢామ్మని కింద పడతాడు. తలకు బలమైన గాయాలు కూడా తగులుగాయి. ఇప్పుడీ ఛాలెంజ్ చాలా ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయింది. థాయ్ లాండ్,ఇండోనేసియాలు ఈ ఆటను ఆడవద్దని ఆదేశించాయి.

గతంలో బర్డ్ బాక్స్ చాలెంజ్ అని ఉండేది. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ పనులు చేయడమే ఈ ఆట ప్రత్యేకత. ఒకమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని కారు నడిపి గోడను గుద్దేసింది. ఇది అమెరికాలోని ఉటా రాష్ట్రంలో జరిగింది. అమ్మాయి తలకి గాయాలయ్యాయి. కారు తుక్కు తుక్కు అయిపోయింది. 2016 ప్రాంతంలో బ్లూ వేల్ ఆట ఇంటర్ నెట్ ను కుదిపేసింది. ఇందులో చేతిమీద తిమింగలం బొమ్మ గీయించుకుని ఆడటం జరిగేది. చివరికి ఆటగాడి మృతితో ఆట ముగిసేది. దేశంలో చాలా మంది పిల్లలు, యువకులు ఈ ఆట ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తరువాత భారత ప్రభుత్వం ఈ ఆట తాలూకు లింకులన్నీ తొలగించేలా చర్యలు తీసుకుని, ప్రాణాలను కాపాడింది. కికి చాలెంజ్ కూడా ఇలాంటిదే.

నడుస్తున్న కారు నుంచి దిగి డాన్స్ చేసి, ఆ వీడియోని పోస్ట్ చేయడమే కికి చాలెంజ్. మన దేశంలో ఒకబ్బాయి ఇలాగే డాన్స్ చేయబోయి పడిపోయాడు. చివరికి ఐసీయూ లో తేలాడు. వీటన్నిటికన్నా ప్రమాదకరమైనది అవుట్ లెట్ చాలెంజ్. ఇందులో పవర్ సాకెట్ లో ప్లగ్గు సగమే పెట్టి, దాని మధ్యలోనుంచి నాణాన్ని దూర్చాలి. ఇలా చేస్తున్నప్పుడు నిప్పు రవ్వలు ఎగిసిపడతాయి. మంటలు అంటుకుంటాయి. షాక్ తగులుతుంది. ఈ ఆట వల్ల చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. శరవేగంగా దూసుకొస్తున్న రైలు ముందు పరిగెత్తడం, నడుస్తున్న రైలు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయడం వంటి ఆటలు కూడా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కాసిన్ని లైకు ల కోసం, కొద్దిపాటి వ్యూస్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి రిస్కులను చేయడం మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.