ఆ డేగలు డ్రోన్ లను తుక్కుతుక్కు చేయనున్నాయి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2020 5:49 AM GMTహైదరాబాద్: ఆకాశంలో గరుడ బృందం.. ఏదో డ్రోన్ ఎగరడాన్ని గమనించింది.. వెంటనే ఆ బృందం లోని ఓ సభ్యుడు గాల్లోకి ఎగిరాడు.. అనుమతి లేకుండా ఎగిరిన డ్రోన్ ను నేల కూల్చాడు. త్వరలోనే తెలంగాణలో ఈ గరుడ బృందం పోలీసులకు సహాయం చేయనుంది. ఇంతకూ ఆ బృందంలోని సభ్యులు ఎవరో తెలుసా..? డేగలు..!
అనుమతి లేకుండా ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ లను కూల్చే విధంగా డేగలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు అధికారులు. విఐపీ ప్రోగ్రామ్ లలో, ప్రభుత్వానికి చెందిన, ముఖ్యమైన ప్రాంతాలలో ఎగురుతున్న డ్రోన్ లను కూల్చి వేసేలా డేగలకు తర్ఫీదుని ఇస్తున్నారు.
ఇలాంటి ప్రాజెక్టు భారత దేశంలో మొదలుపెట్టడం ఇదే మొదటిసారి. నెదర్లాండ్స్ లాంటి దేశాలు ఇప్పటికే డేగలకు డ్రోన్ లను నేల కూల్చేలా ట్రైనింగ్ ను ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఆ పని మొదలుపెట్టనున్నారు. స్నిఫర్ డాగ్స్ తరహాలో 'గరుడ స్క్వాడ్' ను ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడెమీ(ఐఐఐటిఏ) డేగల బృందాన్ని సమాయత్తం చేస్తోంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఐఐఐటిఏ లో గరుడా స్క్వాడ్ ట్రైనింగ్ కు అనుమతులు లభించాయి. హోంశాఖ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపంగా వాటిని ప్రభుత్వం ఆమోదించింది. ఇద్దరు నిపుణుల్ని కాంట్రాక్ట్ పద్దతిలో నియమించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకరికి రూ. 35 వేలు, మరొకరికి రూ. 25 వేలు నెలవారీ గౌరవ వేతనం చెల్లించనున్నారు.