దుబ్బాక ఉప పోరుకు కాంగ్రెస్‌ అభ్యర్థి పేరు ఖరారు..!

By సుభాష్  Published on  5 Oct 2020 7:48 AM GMT
దుబ్బాక ఉప పోరుకు కాంగ్రెస్‌ అభ్యర్థి పేరు ఖరారు..!

తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్‌ 3న ఉప ఎన్నికకు పోలింగ్‌ జరుగనుండగా, 10వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఉప పోరులో విజయం సాధించేందుకు ఎవరివారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయా పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సిద్దిపేట డీసీపీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు నర్సారెడ్డినే అభ్యర్థిగా అధిష్టానానికి ప్రతిపాదించాలని ఆదివారం ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే నర్సారెడ్డితోపాటు శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, వెంకటనర్సింహారెడ్డిల పేర్లు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ నర్సారెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపారు. హరతప్లాజాలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ మణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌..

ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ కీలక నేత రఘునందన్‌రావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ దుబ్బాక ఎన్నికల సమన్వయ కర్త, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఈ మేరక ప్రకటన చేశారు. రాష్ట్ర పార్టీ నుంచి ఆయన ఒక్కడి పేరునే అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రఘునందన్‌రావు నియోజకవర్గంలో ప్రచారాన్ని సైతం హోరెత్తిస్తున్నారు. ప్రతి గ్రామంలో తిరుగుతూ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరణించిన రామలింగారెడ్డి భార్య, లేదా కుమారుడి పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం.

Next Story